ఒమన్ తన ఆర్థిక వ్యవస్థను వైవిధ్యభరితం చేసే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తోంది. చమురు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, పౌరులపై ఆదాయపు పన్ను విధించాలని ఒమన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయంతో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల్లో ఆదాయపు పన్నును ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా ఒమన్ నిలవనుంది.
ఒమన్ ఆర్థిక మంత్రి సయీద్ బిన్ మహ్మద్ అల్ సఖ్రి తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో సామాజిక వ్యయ స్థాయిలను కొనసాగిస్తూనే, ప్రభుత్వ ఆదాయ మార్గాలను విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగా, వార్షిక ఆదాయం 42,000 ఒమనీ రియాల్స్ (సుమారు 1.09 లక్షల అమెరికన్ డాలర్లు) లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారిపై 5 శాతం ఆదాయపు పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన పన్ను విధానం 2028 నుంచి అమల్లోకి వస్తుందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ పన్ను ద్వారా దేశంలోని అత్యధికంగా సంపాదించే వారిలో దాదాపు ఒక శాతం మంది పన్ను పరిధిలోకి వస్తారని అంచనా.
చమురు మినహా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించడంలో భాగంగా ఒమన్ ప్రభుత్వం ఇదివరకే కొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2024లో ప్రభుత్వరంగ ఇంధన సంస్థకు చెందిన అన్వేషణ, ఉత్పత్తి యూనిట్‌లో 2 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా విక్రయించింది.
సాధారణంగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటివి చమురు ఎగుమతుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతాయి. అంతేకాకుండా, విదేశీ ఉద్యోగుల ద్వారా కూడా వీటికి ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం ఈ దేశాల్లో పౌరులపై ఆదాయపు పన్ను లేదు. ఈ నేపథ్యంలో, ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పొరుగున ఉన్న మధ్యప్రాచ్య దేశాలు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.
