అమెరికా… ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తమపై నేరుగా దాడులకు పాల్పడినందున ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ సైన్యం సోమవారం హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం జుల్ఫఘారీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“ఓ జూదగాడివైన ట్రంప్, ఈ యుద్ధాన్ని నువ్వు ప్రారంభించవచ్చు, కానీ ముగించేది మాత్రం మేమే” అని ఆయన హెచ్చరించారు. ఈ సంఘర్షణలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల ఇరాన్ సాయుధ బలగాల చట్టబద్ధమైన లక్ష్యాల పరిధి పెరిగిందని స్పష్టం చేశారు.
ఇటీవల అమెరికా, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఫోర్డోలోని భూగర్భ యురేనియం శుద్ధి కేంద్రంతో పాటు ఇస్ఫహాన్, నతాంజ్‌లలోని అణు కేంద్రాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులతో టెహ్రాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్మూలించామని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి.
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖొమేనీ కూడా స్పందిస్తూ, జూన్ 13న ఇజ్రాయెల్ ప్రారంభించిన బాంబు దాడుల పరంపరను ఒక పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, వివాదం మరింత విస్తృతమైన ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చనే ఆందోళనలతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఐదో వంతు రవాణా అయ్యే కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయకుండా నిరోధించడానికి చైనా సహాయం చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కోరారు.