ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలతో బనకచర్ల అసలు బాగోతం వెలుగులోకి వచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముందుగానే రహస్య ఒప్పందం కుదుర్చుకుని, గోదావరి, కృష్ణా నదుల జలాల్లో తెలంగాణకు కేవలం 1500 టీఎంసీలు ఇస్తే సరిపోతుందని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు తీరని ద్రోహం తలపెట్టారని ఆయన మండిపడ్డారు.
కేబినెట్ సమావేశం నిర్వహించడం, చంద్రబాబుతో చర్చలు జరపాలనే ప్రతిపాదనలు కూడా ఈ ముందస్తు ఫిక్సింగ్‌లో భాగమేనని స్పష్టమవుతోందని హరీశ్ రావు అన్నారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బనకచర్ల అంశంపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు శుక్రవారం స్పందించారు.
గోదావరి జలాల్లో తెలంగాణకు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) ప్రకారం 968 టీఎంసీల హక్కు ఉందని, సముద్రంలో వృధాగా కలిసిపోతున్న 3000 టీఎంసీల నీటిలో అదనంగా 1950 టీఎంసీలు కేటాయించాలని గతంలో కేసీఆర్ డిమాండ్ చేశారని హరీశ్ రావు గుర్తుచేశారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయకపోవడం, చంద్రబాబుతో చర్చలు జరుపుతామని చెప్పడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇస్తున్న గురుదక్షిణగా భావించాలా? అని నిలదీశారు.
కృష్ణా జలాల విషయంలో కేవలం 299 టీఎంసీలకే బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాలనలో తెలంగాణ ప్రాంతంలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల సామర్థ్యం 299 టీఎంసీలకే పరిమితంగా ఉండటంతో, అప్పుడు మన వాటా కూడా అంతే ఉండేదని ఆయన వివరించారు. “ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువడే వరకు 299 టీఎంసీలు సరిపోవని, ఉమ్మడి రాష్ట్ర వాటాలో కనీసం సగం, అంటే 405 టీఎంసీలు తాత్కాలికంగా కేటాయించాలని మేం ఆనాడే డిమాండ్ చేశాం” అని హరీశ్ రావు తెలిపారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెక్షన్ 3 ప్రకారం కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌తో కృష్ణా ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు సమర్థవంతంగా వినిపించే అవకాశాన్ని సాధించారని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణకు 763 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతూ అఫిడవిట్ కూడా దాఖలు చేశామని, రేపోమాపో ఆ వాటా సాధించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.