AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అప్పటి డీజీపీ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశా.. సిట్ విచారణలో ప్రభాకర్‌రావు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఐదోసారి విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిన్న ఈ విచారణ దాదాపు 8 గంటల పాటు కొనసాగింది. తాజా విచారణలో ఆయన పొంతన లేని సమాధానాలు ఇస్తూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిసింది.

 

గతంలో తాను పనిచేసిన సమయంలో అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌ చేశానని, ఈ వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ప్రభాకర్ రావు సిట్‌కు వివరించినట్టు సమాచారం. అయితే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వంటి వారు మాత్రం తామంతా ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను పర్యవేక్షించామని ఇప్పటికే సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు.

 

ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు వారికి ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చారనే కోణంలో సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే సమాచారంతో కొందరి ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చిందని ప్రభాకర్ రావు గతంలో చెప్పారు. దీంతో దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని సిట్ కోరడంతో, ఇప్పుడు ఆయన ఉన్నతాధికారుల వైపు వేలెత్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

 

ప్రభాకర్ రావు కేసు నుంచి తప్పించుకోవడానికే ఇటువంటి వాదనలు తెరపైకి తెస్తున్నారని సిట్ అధికారులు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు ఇతర నిందితులు ఆయన పేరు చెబుతుండగా, ఆయన మాత్రం నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.

ANN TOP 10