AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యోగాకు హద్దుల్లేవు.. వయసుతో పట్టింపు లేదు: ప్రధాని మోదీ..

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం, జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాకు వయసు, హద్దులు వంటి పరిమితులు లేవని, ఇది అందరికీ చెందిందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవనశైలిలో యోగా అంతర్భాగంగా మారిందని, ఇది ప్రపంచాన్ని ఏకం చేసే శక్తిగా నిలిచిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన “యోగాంధ్ర” కార్యక్రమాన్ని, ముఖ్యంగా నారా లోకేష్ కృషిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రతాపరావు జాదవ్, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు హాజరయ్యారు.

 

యోగా ప్రస్థానం – ప్రపంచ ఏకీకరణ

గత దశాబ్ద కాలంలో యోగా ప్రయాణాన్ని తాను గమనిస్తున్నానని, ఐక్యరాజ్యసమితిలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని భారత్ ప్రతిపాదించినప్పుడు అతి తక్కువ సమయంలోనే 175 దేశాలు మద్దతు పలికాయని ప్రధాని గుర్తుచేశారు. ఇది కేవలం ఒక ప్రతిపాదనకు మద్దతు మాత్రమే కాదని, మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచం చేసిన సామూహిక ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. “ఈ రోజు, 11 సంవత్సరాల తర్వాత, యోగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవనశైలిలో భాగమైంది. దివ్యాంగులు బ్రెయిలీ లిపిలో యోగా శాస్త్రాన్ని చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా చేయడం, యువత యోగా ఒలింపియాడ్‌లలో పాల్గొనడం గర్వకారణం” అని మోదీ అన్నారు. సిడ్నీ ఒపేరా హౌస్ మెట్ల నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు, సముద్ర విస్తీర్ణం వరకు ప్రతిచోటా “యోగ అందరిదీ, అందరి కోసం” అనే సందేశం ప్రతిధ్వనిస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

యోగాంధ్రకు ప్రధాని ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో యోగా దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం “యోగాంధ్ర” అనే అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రశంసించారు. “యోగ కార్యక్రమాన్ని సామాజికంగా ఎలా నిర్వహించాలో, సమాజంలోని అన్ని వర్గాలను ఎలా భాగస్వాములను చేయాలో నారా లోకేష్ గారు గత నెల, నెలన్నర రోజులుగా సాగిన యోగాంధ్ర ప్రచారంలో చేసి చూపించారు. ఇందుకోసం సోదరుడు లోకేష్ ఎన్నో అభినందనలకు అర్హులు. ఇలాంటి కార్యక్రమాలను సామాజిక స్థాయిలో ఎంత లోతుగా తీసుకెళ్లవచ్చో లోకేష్ చేసిన పనిని ఒక నమూనాగా చూడాలి” అని ప్రధాని మోదీ అన్నారు. యోగాంధ్ర ప్రచారంతో 2 కోట్లకు పైగా ప్రజలు అనుసంధానమయ్యారని తనకు తెలిసిందని, ఈ ప్రజా భాగస్వామ్య స్ఫూర్తే వికసిత భారత్‌కు మూలాధారమని ఆయన పేర్కొన్నారు.

 

ఒకే భూమి – ఒకే ఆరోగ్యం

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం “ఒకే భూమి – ఒకే ఆరోగ్యం కోసం యోగా” అని ప్రధాని తెలిపారు. “భూమిపై ప్రతి జీవి ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉందనే లోతైన సత్యాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుంది. మానవ శ్రేయస్సు మనం పండించే నేల ఆరోగ్యంపైనా, మనకు నీరందించే నదులపైనా, మన పర్యావరణ వ్యవస్థను పంచుకునే జంతువుల ఆరోగ్యంపైనా, మనల్ని పోషించే మొక్కలపైనా ఆధారపడి ఉంటుంది. యోగా ఈ పరస్పర సంబంధాన్ని మనకు మేల్కొలుపుతుంది” అని మోదీ వివరించారు.

 

శాంతి, సమగ్రతకు యోగా

ప్రస్తుతం ప్రపంచం అనేక ఒత్తిళ్లతో సతమతమవుతోందని, పలు ప్రాంతాల్లో అశాంతి, అస్థిరత నెలకొన్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా శాంతి దిశగా మార్గం చూపుతుందని అన్నారు. “మానవాళికి కాస్త విరామం ఇచ్చి, శ్వాస తీసుకుని, సమతుల్యం సాధించి, తిరిగి సంపూర్ణంగా మారడానికి యోగా ఒక పాజ్ బటన్ లాంటిది” అని ఆయన వర్ణించారు. అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారే “మానవాళి కోసం యోగా 2.0″కు ఈ యోగా దినోత్సవం నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు.

 

యోగా పరిశోధన, ప్రోత్సాహం

యోగా విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధనలతో మరింత బలోపేతం చేయడానికి భారత్ కృషిచేస్తోందని ప్రధాని తెలిపారు. దేశంలోని ప్రముఖ వైద్య సంస్థలు యోగాపై పరిశోధనలు చేస్తున్నాయని, ఎయిమ్స్ పరిశోధనలో గుండె, నరాల సంబంధిత రుగ్మతల చికిత్సలో, మహిళల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సులో యోగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా యోగా, వెల్‌నెస్ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, డిజిటల్ టెక్నాలజీ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. యోగా పోర్టల్, యోగేంద్ర పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కార్యక్రమాలు నమోదయ్యాయని తెలిపారు. భారత్ ప్రపంచానికి ఉత్తమ హీలింగ్ కేంద్రంగా మారుతోందని, ఇందుకు ప్రత్యేక ఈ-ఆయుష్ వీసాలు కూడా అందిస్తున్నామని ఆయన చెప్పారు.

 

స్థూలకాయంపై పోరుకు పిలుపు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థూలకాయం సమస్యపై కూడా దృష్టి సారించారు. “పెరుగుతున్న స్థూలకాయం ప్రపంచానికి పెద్ద సవాలు. దీనికోసం మన ఆహారంలో 10% నూనె వాడకాన్ని తగ్గించే ఛాలెంజ్‌ను కూడా ప్రారంభించాను. ఈ ఛాలెంజ్‌లో చేరాలని దేశ, ప్రపంచ ప్రజలకు మరోసారి పిలుపునిస్తున్నాను. నూనె వాడకం తగ్గించడం, అనారోగ్యకరమైన ఆహారాన్ని నివారించడం, యోగా చేయడం మెరుగైన ఫిట్‌నెస్‌కు మూలికలు” అని ఆయన సూచించారు.

 

యోగాను ఒక ప్రజా ఉద్యమంగా మార్చి, ప్రపంచాన్ని శాంతి, ఆరోగ్యం, సామరస్యం వైపు నడిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని, ప్రజలను అభినందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా అభ్యాసకులకు, యోగా ప్రేమికులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10