రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు పెద్ద ఎత్తున రుణాలు విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు.
రెండో రోజు కార్యక్రమంలో భాగంగా నిన్న తుళ్లూరులో ఈ బృందం పర్యటించింది. అమరావతి నిర్మాణంలో పర్యావరణ, సామాజిక రక్షణ అంశాలపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. రాజధాని ప్రాంతంలో కాంట్రాక్ట్ సంస్థలు తమ కార్యకలాపాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని చెప్పారు.
అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా పర్యావరణ, సామాజిక రక్షణ కార్యకలాపాల అమలు, కార్మికుల ఆరోగ్య భద్రత తదితర విషయాలను కాంట్రాక్ట్ సంస్థలకు వివరించారు. స్థానికంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సీఆర్‌డీఏ అధికారులు స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు కార్మిక చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే సంబంధిత సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు.