AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 110 మంది భారతీయులు..

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధు’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 110 మంది భారతీయ పౌరులతో కూడిన తొలి విమానం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకుంది. వీరిలో 90 మంది జమ్మూ కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 6ఈ 9487 ప్రత్యేక విమానంలో వీరంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి, ఇరాన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు, ఇతర పౌరులకు స్వాగతం పలికారు.

 

ఇరాన్‌లోని భారతీయ పౌరుల భద్రత, వారిని సురక్షితంగా తరలించడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధు’ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను భారత ఎంబ‌సీ సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) నిన్న‌ సాయంత్రం అధికారికంగా ప్రకటించింది.

 

“టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను, వారి భద్రత దృష్ట్యా, భారత రాయబార కార్యాలయం చేసిన ఏర్పాట్ల ద్వారా నగరం నుంచి బయటకు తరలించడం జరిగింది” అని మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో పేర్కొంది.

 

ఇక‌, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా క్షీణిస్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇరాన్‌లో చిక్కుకున్న మరియు సహాయం కోసం అభ్యర్థించిన భారతీయ పౌరుల భద్రత కోసం గత కొద్ది రోజులుగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలలో ఇది ఒక భాగమని అధికారులు తెలిపారు. ఈ తరలింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసింది.

 

“విదేశాలలో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్‌లో భాగంగా, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం, ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులను దేశంలోని సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి, ఆపై అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా వారిని స్వదేశానికి తరలించడానికి సహాయం చేస్తోంది” అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

ఇరాన్‌లోని భారతీయ పౌరులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ద్వారా, అలాగే న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 24×7 కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలని ఈ సంద‌ర్భంగా ఎంఈఏ సూచించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10