అనారోగ్య కారణాలతో జగిత్యాల జిల్లా మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూశారు. గత కొంతకాలంగా కొమిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచారు.
కొమ్మరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెట్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. 2004 -2009 వరకు ఆయన మెట్ పల్లి ఎమ్మెల్యేగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా 2004లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2009లో జరిగిన నియోజవర్గాల పునర్విభజనలో మెట్ పల్లి నియోజకవర్గం కోరుట్ల అసెంబ్లీ స్థానంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. కొమిరెడ్డి మృతి పట్ల కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొమిరెడ్డి మృతి తీరని లోటని పలువురు నాయకులు చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే మృతితో స్థానికంగా విషాధచాయలు అలముకున్నాయి. ఆయన హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు.