మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఈరోజు తెల్లవారుజామున ముందస్తు వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. ఈ పరిణామం ప్రాంతీయంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
దాడుల వివరాలు.. ఇజ్రాయెల్ వాదన
ఇజ్రాయెల్ సైనిక వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక కేంద్రాలు, సైనిక కమాండ్ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాదాపు 15 అణు వార్హెడ్లకు సరిపడా శుద్ధి చేసిన యురేనియం నిల్వ చేసిందని, ప్రయోగించగల అణ్వాయుధాన్ని తయారు చేయడానికి కేవలం కొన్ని నెలల దూరంలో ఉందని ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది తమ ఆత్మరక్షణ కోసం తీసుకున్న చర్య అని పేర్కొంది.
ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి
ఈ దాడుల అనంతరం ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు జరగవచ్చన్న ఆందోళనతో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశవ్యాప్తంగా ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులకు పాల్పడవచ్చని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
టెహ్రాన్ నగరం దాని పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు, క్షిపణి దాడులు జరిగినట్లు ధ్రువీకరించబడింది. పలు ప్రాంతాల నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇరాన్ సైనిక కమాండ్‌లోని ఉన్నతాధికారులు, సీనియర్ అణు శాస్త్రవేత్తలు కొందరు ఈ దాడుల్లో మరణించి ఉండవచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
అమెరికా కీలక ప్రకటన
ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరు దేశాలను సంయమనం పాటించాలని కోరారు. ఇరాన్ తమ దేశ సిబ్బందిని గానీ, ప్రయోజనాలను గానీ లక్ష్యంగా చేసుకోవద్దని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా మధ్యప్రాచ్యంలోని కొన్ని అమెరికా రాయబార కార్యాలయాల నుంచి సిబ్బందిని తరలించడం ప్రారంభించినట్లు సమాచారం.