హనీమూన్‌లో తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన సోనమ్ రఘువంశీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య తాను చేయలేదని, తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసుల విచారణలో సోనమ్ చెప్పినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సోనమ్ బాయ్‌ఫ్రెండ్‌గా అనుమానిస్తున్న రాజ్ కుశ్వాహాను కూడా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో సోనమ్ ఏం చెప్పిందంటే?
పోలీసు వర్గాల కథనం ప్రకారం, “ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరో కిడ్నాప్ చేసి, ఆ తర్వాత గాజీపుర్‌లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచే నేను మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాను” అని సోనమ్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గాజీపుర్‌లోని ఒక హోటల్ వద్ద నుంచే పోలీసులు సోనమ్‌ను అరెస్ట్ చేశారు. ఆమె తన ఫోన్ నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారు.
తెరపైకి ‘బాయ్‌ఫ్రెండ్’ పాత్ర
ఈ కేసులో సోనమ్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని భావిస్తున్న రాజ్ కుశ్వాహా అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్‌కు చెందిన కుశ్వాహా, సోనమ్ సోదరుడు నడుపుతున్న ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు తెలిపారు. కొంతకాలంగా సోనమ్‌తో రాజ్ కుశ్వాహాకు సన్నిహిత సంబంధాలున్నాయని, అతని ప్రణాళిక ప్రకారమే ఆమె భర్తను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
హనీమూన్‌లో ఘోరం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తోంది. మే 11న రాజా రఘువంశీకి సోనమ్‌తో వివాహం జరిగింది. 20న నవ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వారిద్దరూ కనిపించకుండా పోయారు. దాదాపు 11 రోజుల తర్వాత, మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలోని ఒక జలపాతం సమీపంలో ఉన్న లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం సోనమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా, ఆమె గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ఈ కేసులో ఆమె లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.