AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త..!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు.  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

 

మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. విద్యుత్ పనులు చేసే సమయంలో ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా రక్షణ పరికరాలు వాడాలని సూచించారు.

 

మల్లం గ్రామంలో దళిత సామాజికవర్గానికి చెందిన పల్లపు సురేశ్ అనే ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. ఈ ఘటన గ్రామంలో స్పర్థలకు దారితీసిందని, రాజకీయ లబ్ధి కోసం ఆలోచించేవారు ఇలాంటి గొడవలను పెద్దవి చేస్తారన్నారు. తాము మాత్రం సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తామన్నారు.

 

గత ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేసే కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10