AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాక్ గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్బీర్ సింగ్ విచారణలో సంచలన విషయాలు..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జాన్‌మహల్ వీడియో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జస్బీర్, పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై జూన్ 4న అరెస్టయ్యాడు. ఈ అరెస్ట్… దేశ సరిహద్దులు దాటి విస్తరించినట్లు అనుమానిస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తులో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు.

 

విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు

 

పోలీసుల కస్టడీలో ఉన్న జస్బీర్ సింగ్‌ను విచారిస్తున్న కొద్దీ అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను ఆరుసార్లు పాకిస్థాన్ వెళ్లినట్లు, ఫోన్‌లో సుమారు 150 పాకిస్థానీ కాంటాక్ట్ నంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా పాకిస్థాన్ నిఘా విభాగానికి చెందిన ఒక అధికారికి తన ల్యాప్‌టాప్‌ను దాదాపు గంటపాటు ఇచ్చినట్లు కూడా గుర్తించారు.

 

గతంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో వెలుగులోకి వచ్చిన పాకిస్థాన్ గూఢచర్య నెట్‌వర్క్‌తో జస్బీర్ సింగ్‌కు కూడా సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ అలియాస్ ఎహసాన్-ఉర్-రెహమాన్‌తో జస్బీర్ టచ్‌లో ఉన్నట్లు తేలింది.

 

ఒక మహిళా స్నేహితురాలి ద్వారా డానిష్‌తో పరిచయం ఏర్పడిందని జస్బీర్ మొహాలీ కోర్టులో చెప్పాడు. అంతేకాకుండా డానిష్ తన ద్వారా కొన్ని సిమ్ కార్డులు కూడా తెప్పించుకున్నాడని జస్బీర్ పోలీసులకు చెప్పాడు. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అనంతరం డానిష్ ప్రమేయం బయటపడటంతో అతన్ని న్యూఢిల్లీ నుంచి బహిష్కరించారు.

 

శనివారం జస్బీర్ సింగ్ పోలీస్ రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించారు. జ్యోతి మల్హోత్రాతో జస్బీర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, పాకిస్థాన్ నిఘా వర్గాలు మరియు ఆర్మీ అధికారులతో కూడిన ‘ఉగ్రవాద ప్రేరేపిత గూఢచర్య నెట్‌వర్క్‌’ను తాము ఛేదించామని అతని అరెస్ట్ అనంతరం పోలీసులు తెలిపారు.

 

ఇంతకుముందు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారి షకీర్ అలియాస్ జాట్ రణధావాతో జస్బీర్‌కు సంబంధాలున్నట్లు గుర్తించారు. 2020, 2021, 2024 సంవత్సరాల్లో పాకిస్థాన్ పర్యటనల సమయంలో అతను ఐఎస్ఐ అధికారులతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పాకిస్థాన్ మాజీ పోలీస్ అధికారి నాసిర్ ధిల్లాన్ లాహోర్‌లో ఐఎస్ఐ అధికారులకు తనను పరిచయం చేశాడని కూడా జస్బీర్ పోలీసులకు చెప్పాడు. జస్బీర్ యూట్యూబ్ ఛానెల్‌కు 11 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా అందులో అతను ప్రయాణ, వంటలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు.

ANN TOP 10