దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6 గురువారం రోజున జరగనున్న హనుమాన్ జయంతిని దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలను కాపాడాలని అన్ని రాష్ట్రాలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. శ్రీరామనవమి సందర్భంగా బీహార్, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న క్రమంలో అలెర్ట్ గా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ ట్విటర్లో వెల్లడించింది. ‘‘హనుమాన్ జయంతి ఏర్పాట్ల నిమిత్తం అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పండగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ముప్పును నిరంతరం పర్యవేక్షించాలి’’ అని హోంశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది.
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని కోల్ కత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
.
హనుమాన్ జయంతి సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 6 వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.