AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బనకచర్ల ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు: సీఎం చంద్రబాబు..

సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ-పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితరాలు అన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణకు కూడా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని చెప్పారు. అలాగే, టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం ఈ నెలాఖరు కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

 

బనకచర్లకు రుణ సమీకరణ ఇలా…

 

జలహారతి కార్పొరేషన్ కింద పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండగా, దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీపీ) ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్ధిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే రూ.81,900 కోట్ల వ్యయంలో 50 శాతం అంటే రూ.40,950 ఈఏపీ రుణంగా పొందాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌గా 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం నిధులు రూ.8,190 కోట్లు, హ్యామ్ విధానంలో మరో 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు ఖర్చు చేయనున్నారు.

 

ఓవైపు, బనకచర్ల ప్రాజెక్టును అంగీకరించలేది లేదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెబుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ANN TOP 10