ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. దీపక్ వర్మ అనే వ్యక్తి మూడేళ్ల పసిపాపను అపహరించి, అత్యాచారం చేశాడు. ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేశారు. అత్యాచారానికి గురైన చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
గురువారం తెల్లవారుజామున, రద్దీగా ఉండే ఐఎస్‌బీటీ, మెట్రో ప్రాంత సమీపంలోని ఒక వంతెన కింద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు అపహరించాడు. తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు పాప కనపడకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం పాపను అపహరించిన ప్రదేశానికి సుమారు 500 మీటర్ల దూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని దారిన పోయే ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వైద్య పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలికకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం నాటికి కూడా ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ దారుణ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆలంబాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో నిందితుడు చిన్నారిని స్కూటర్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. స్కూటర్ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా నిందితుడిని దీపక్ వర్మగా గుర్తించారు. వర్మపై లక్నోలోని పలు పోలీస్ స్టేషన్లలో గతంలోనే అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, అతను పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.
ఈ క్రమంలో నిందితుడి కదలికలపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, కంటోన్మెంట్ ప్రాంతంలోని దేవి ఖేడా వద్ద పోలీసులు అతన్ని అడ్డగించారు. లొంగిపొమ్మని పోలీసులు హెచ్చరించగా, దీపక్ వర్మ వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వర్మ తీవ్రంగా గాయపడగా, వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేవలం 20 గంటల్లోనే నిందితుడిని గుర్తించి, పట్టుకోవడం గమనార్హం.