వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. కేబినెట్ భేటీలో ప్రభుత్వ పెద్దల మధ్య దీనికి సంబంధించి కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నిర్ణయించారు. అంతేకాదు నేరం రుజువయ్యాక ఎవరినీ ఉపేక్షించేది లేదని తేల్చారు. రాజకీయ కక్ష సాధింపు మన విధానం కాదని సీఎం చంద్రబాబు నేతలకు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రమాదకర రాజకీయాలున్నాయన్నాయని నేతలకు తెలిపారు. గతంలో క్రిమినల్స్‌ను కలిసేందుకు నేతలు భయపడేవారని.. ప్రస్తుతం ఓపెన్‌గానే కలిసి సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. పరోక్షంగా జగన్ పర్యటనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది.
తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పదన్న సీఎం చంద్రబాబు
ఇదే సమయంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు నేతలు. దీనికి సమాధానంగా వైసీపీ వారు వేధించారని మనమూ వారిని వేధించడం సరికాదని చంద్రబాబు నేతలకు తెలిపినట్టు తెలుస్తోంది. అయితే తప్పు చేశారని రుజువైతే మాత్రం ఎంతటి వారికైనా శిక్ష తప్పదని ఖరాఖండిగా తెలిపారు.
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
మరోవైపు అమరావతి పనులు వేగవంతం, రాజధానిలో 5 వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణం.. ఇలా ఏపీ క్యాబినెట్ కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు.. మంత్రులకు సూచించారు. ఇక.. రేపు ఒక్కరోజే కోటి మొక్కలు నాటే కార్యక్రమంపైనా క్యాబినెట్‌లో చర్చ జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే.. కూటమి ప్రభుత్వ అజెండా కావాలని.. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి సూచించారు.
అమరావతి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా.. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి పనుల్ని వేగవంతం చేయాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక.. రాజధాని రెండో దశ కోసం మరో 44 వేల ఎకరాల భూసేకరణపైనా మంత్రివర్గం చర్చించింది. అమరావతిలో 5 వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై చర్చించారు. ఇక.. త్వరలో ప్రారంభించబోయే సంక్షేమ పథకాలపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం అమలు, కార్యాచరణపై చర్చ జరిగింది. విశాఖలో నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంపైనా చర్చించారు. ప్రధాని మోదీ పాల్గొనే యోగా డేని విజయవంతం చేసే దిశగా కార్యాచరణ ఉండాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు.
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం విషయంలో దూకుడుగా ముందుకెళ్లాలని..
రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 5 కోట్ల 75 లక్షలు, కుప్పం నియోజకవర్గంలో 8 కోట్ల 22 లక్షల గ్యాప్ ఫండ్ విడుదలకు.. క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 248 మంది కానిస్టేబుళ్లకు.. హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకొచ్చిన జీవోకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రతి జిల్లా కేంద్రంలో ఓ పీ4 ఆఫీసు ఏర్పాటుకు
అలాగే.. వివిధ సంస్థలకు భూకేటాయింపులు, రాయితీల కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు 2025 చట్టంలో నిబంధనల సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీ4 విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు, ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లేందుకు.. ప్రతి నియోజకవర్గంలో ఓ కార్యాలయం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 12వ తేదీలోగా.. ప్రతి జిల్లా కేంద్రంలో ఓ పీ4 ఆఫీసు ఏర్పాటుకు కృషి చేయాలన్నారు సీఎం. 8 గంటల్లో చేసే పనిని 12 నిమిషాల్లోనే పూర్తి చేసే.. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపైనా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.
మంత్రులకు సూచించిన సీఎం చంద్రబాబు
కూటమి సర్కార్ ఏడాది పాలనపై కేబినెట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. క్యాబినెట్ మీటింగ్ ముగిశాక.. మంత్రులతో పలు విషయాలను చర్చించారు సీఎం చంద్రబాబు.