సైనికాధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట సేవా పతకాలు ప్రదానం చేశారు. త్రివిధ దళాలకు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 మంది అధికారులకు పరమ విశిష్ట సేవా పతకాలు, ఐదుగురికి ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 57 మందికి అతి విశిష్ట సేవా పతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.
పరమ విశిష్ట సేవా పతకం, నౌ సేనా మెడల్ పొందిన వారిలో ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ వెన్నం ఉన్నారు. కొచ్చి కేంద్రంగా ఉన్న సదరన్ కమాండ్ లో నౌకాదళానికి చెందిన అన్ని రకాల శిక్షణ పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. 38 ఏళ్లుగా వివిధ హోదాల్లో నౌకాదళంలో సేవలందిస్తూ వైస్ అడ్మిరల్ స్థాయికి చేరుకున్నారు.