AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐరాసలో భారత్‌పై ఆరోపణలు..! జర్నలిస్టు ప్రశ్నతో కారణం తడబాటు పడ్డ బిలావల్ భుట్టో..!

ఐక్యరాజ్యసమితి (ఐరాస) మీడియా సమావేశంలో పాకిస్థాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టోకు ఊహించని ప్రశ్న ఎదురైంది. పహల్గామ్ ఉగ్రదాడిని అడ్డం పెట్టుకుని “భారత్‌లో ముస్లింలను రాక్షసులుగా చిత్రీకరిస్తున్నారని” బిలావల్ ఆరోపించిన వెంటనే, ఓ సీనియర్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఆ తర్వాత భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు.

 

వివరాల్లోకి వెళితే, ఐరాస మీడియా సమావేశంలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ, భారత్‌లో ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రముఖ జర్నలిస్టు అహ్మద్ ఫాతి, “సర్, నేను ఇరుపక్షాల సమావేశాలను గమనించాను. నా గుర్తున్నంత వరకు, భారత పక్షాన జరిగిన సమావేశాల్లో ముస్లిం భారత సైనిక అధికారులు కూడా ఉన్నారు” అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాదనను సమర్థవంతంగా వినిపించి, దేశానికి స్ఫూర్తిగా నిలిచిన కల్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశించి ఫాతి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులిచ్చేందుకు బిలావల్ కాస్త తడబడ్డారు. కాసేపాగి…”ఆపరేషన్ విషయానికొస్తే, మీరు చెప్పింది నిజమే” అని బిలావల్ అంగీకరించారు. ఇక, ఫాతి తదుపరి ప్రశ్న అడగకముందే, బిలావల్ మధ్యలో కల్పించుకుని కొంతసేపు భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, జర్నలిస్టు తన వాదనను స్పష్టంగా వినిపించగలిగారు.

 

బిలావల్ భుట్టో ప్రస్తుతం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడిగా, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో ఆయన దేశ విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. ఐరాస ప్రెస్ మీట్‌లో, కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడంలో ఇస్లామాబాద్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయని బిలావల్ అంగీకరించారు. “ఐరాసలోనూ, సాధారణంగా కాశ్మీర్ విషయంలో మాకు ఎదురవుతున్న ఆటంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి” అని ఆయన తెలిపారు. ఇటీవలి సంఘర్షణ తర్వాత భారత్ ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన చర్యలు చేపట్టినట్లే, పాకిస్థాన్ కూడా విదేశాలకు ప్రతినిధి బృందాలను పంపింది. ఈ బృందాలలో ఒకదానికి బిలావల్ భుట్టో నాయకత్వం వహిస్తున్నారు.

 

గతంలో కూడా బిలావల్ భుట్టో తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇవి ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా పలువురు భావించారు. పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకులు మరణించిన నేపథ్యంలో, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయాలని నిర్ణయించిన తర్వాత, “సింధు నది మాది, మాదిగానే ఉంటుంది – దాని గుండా మా నీరు ప్రవహిస్తుంది, లేదా వారి రక్తం ప్రవహిస్తుంది” అని బిలావల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

బిలావల్ బాధ్యతారహితమైన వ్యాఖ్యలను ఖండించిన వారిలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ అయిన ఒవైసీ, బిలావల్ తన తల్లి, పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను, తన తాత, దేశ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోను ఎవరు చంపారో గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

 

“ఇలాంటి పసితనపు మాటలు మానండి. ఆయన తాతకు ఏమైందో ఆయనకు తెలియదా? ఆయన తల్లి? ఆమెను ఉగ్రవాదులు చంపారు. కాబట్టి, కనీసం ఆయన ఇలా మాట్లాడకూడదు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? అమెరికా మీకు ఏదైనా ఇస్తే తప్ప మీరు దేశాన్ని నడపలేరు, అలాంటిది మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా?” అని ఒవైసీ ప్రశ్నించారు.

 

“ఆయన తల్లిని ఎవరు చంపారో ఆయన ఆలోచించుకోవాలి. ఉగ్రవాదమే ఆమెను చంపింది. అది ఆయనకు అర్థం కాకపోతే, ఆయనకు ఏం వివరిస్తాం? మీ అమ్మను కాల్చినప్పుడు అది ఉగ్రవాదం…. మా తల్లులను, కుమార్తెలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?” అని ఒవైసీ నిలదీశారు.

ANN TOP 10