ఇంటర్నెట్ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో విస్తరిస్తున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు వివిధ రూపాల్లో వల విసురుతున్నారు. ముఖ్యంగా మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా తెలంగాణ పోలీసు విభాగం అప్రమత్తం చేస్తూ హెచ్చరిక జారీ చేసింది.
మాట్రిమోనియల్ సైట్లలో జాగ్రత్తలు
పెళ్లి సంబంధాల కోసం చాలామంది మాట్రిమోనియల్ వెబ్‌సైట్లపై ఆధారపడుతున్నారు. అయితే, వీటిలో కొన్ని నకిలీ ప్రొఫైల్స్ (ఫేక్ ప్రొఫైల్స్) ఉండే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆకర్షణీయమైన ఫోటోలు, నమ్మశక్యంగా లేని వివరాలు చూసి వెంటనే ఆకర్షితులై మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిగా పరిచయం లేని వ్యక్తులకు మీ వ్యక్తిగత వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటివి తెలియజేయకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో అపరిచితులను గుడ్డిగా నమ్మడం ప్రమాదకరమని, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని సూచించారు.
ఈ-కేవైసీ, బ్యాంకింగ్ మోసాలు
ఈ-కేవైసీ (eKYC) అప్‌డేట్ చేయాలంటూ వచ్చే సందేశాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ పోలీసులు ‘ఎక్స్’ ఖాతా ద్వారా మరో ట్వీట్ చేశారు. ఈ కేవైసీ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్స్ వంటి అనుమానాస్పద ఫైళ్లను మీ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే, తాము బ్యాంకు సిబ్బందిమంటూ కొందరు ఫోన్లు చేసి, మీ ఖాతా వివరాలు, ఓటీపీ వంటివి అడిగే అవకాశం ఉందని, కానీ బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ ఫోన్ ద్వారా ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని అడగరని గుర్తించాలని సూచించింది. ఓటీపీ చెప్పమని ఎవరైనా అడిగితే, అది కచ్చితంగా మోసపూరిత కాల్ అని భావించి, ఎలాంటి వివరాలు పంచుకోవద్దని సూచించారు. మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు వంటి అత్యంత సున్నితమైన విషయాలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలని, ఎవరితోనూ పంచుకోకూడదని హితవు పలికారు.