పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సైనికుల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు ఏళ్లుగా సరిహద్దు ఆవల ఉన్న ఏజెంట్లకు చేరవేస్తున్నాడని, అందులో ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన సున్నితమైన వివరాలు కూడా ఉన్నాయని పంజాబ్ పోలీస్ చీఫ్ తెలిపారు.
నిందితుడు కొన్నేళ్లుగా ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత సైన్యానికి చెందిన ముఖ్యమైన కార్యకలాపాలు, వ్యూహాలు, సైనికుల కదలికల వంటి కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్థానీ ఏజెంట్లకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూడా కీలకమైన సమాచారాన్ని శత్రుదేశానికి అందించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ అరెస్ట్ దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిందితుడికి అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కూడా సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. హఫీజ్ సయీద్‌తో నిందితుడు దిగిన ఫోటోలు కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. హఫీజ్ సయీద్ భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారి. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన వ్యక్తి ద్వారా మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పంజాబ్ పోలీసు చీఫ్ ఈ అరెస్ట్‌ను మంగళవారం ధ్రువీకరించారు. నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. అతని నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉంది, ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
