AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు ఐపీఎల్ ఫైనల్..! ఉత్కంఠ పోరులో గెలిచేదెవరు..?

క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ జరగనున్న ఈ టైటిల్ ఫైట్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా, వారికి ఇదే తొలి ఐపీఎల్ ట్రోఫీ కానుండటం విశేషం. ఈ మెగా ఫైట్‌కు ముందు, సోమవారం ఇరుజట్ల కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్ (పీబీకేఎస్), రజత్ పాటిదార్ (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీతో ప్రత్యేక ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ వీడియోను ఐపీఎల్ త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా అభిమానుల‌తో పంచుకుంది. 

లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ జట్లు, ఫైనల్ చేరే క్రమంలోనూ తమదైన ముద్ర వేశాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ, నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) అడ్డంకిని అధిగమించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడుసార్లు ముఖాముఖి తలపడ్డాయి.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు తమ వ్యూహాల గురించి కెప్టెన్లు పంచుకున్నారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ… “ఆర్సీబీ లాంటి జట్టుకు ఫైనల్‌లో నాయకత్వం వహిస్తున్నప్పుడు అంచనాలు సహజంగానే ఉంటాయి. అయితే, నేను ఎప్పుడూ నా నియంత్రణలో ఉన్నవాటిపైనే దృష్టి పెడతాను. ప్రస్తుతంపైనే ఏకాగ్రత సారిస్తాను. ఈ కెప్టెన్సీ ప్రయాణం నాకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. అత్యుత్తమ నాయకులు, విదేశీ ఆటగాళ్లతో కలిసి పనిచేయడం నా దృక్పథాన్ని మార్చింది. దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉండేలా, ప్రశాంతమైన వాతావరణాన్ని జట్టులో కల్పించడంపై దృష్టి సారించాను. మేం ఫైనల్ అనే వేదిక గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. మా అత్యుత్తమ క్రికెట్ ఆడటానికి ఇక్కడికి వచ్చాం” అని తెలిపాడు.

పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… “నేను ప్రస్తుత క్షణాల‌ను ఆస్వాదిస్తున్నాను. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి, ఫైనల్‌కు చేరిన ఆనందాన్ని సహచరులతో పంచుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేను భావించేది ఏంటంటే, పని సగమే పూర్తయింది. కాబట్టి, ఫైనల్ గురించి ఎక్కువగా ఆలోచించాలనుకోవడం లేదు. రేపటి ఆటకు ముందు ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంటూ, మంచి మానసిక స్థితిలో ఉండటానికే ప్రయత్నిస్తాను” అని అన్నాడు.

ఇరు జట్ల కెప్టెన్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండటంతో, ఫైనల్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ జట్టు చరిత్ర సృష్టించి తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడుతుందో చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10