బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని ఆమె చేసిన ప్రకటనను ఇరు పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్న తరుణంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. కవిత బీజేపీ వదిలిన బాణమని, ఆమె వెనుక పెద్ద వ్యూహమే ఉందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రానికి కవిత చేసిన సేవ ఏంటని మధుయాష్కీ సూటిగా ప్రశ్నించారు. తన అవినీతి సంపదను కాపాడుకోవడానికే కవిత ‘తెలంగాణ జాగృతి’ సంస్థను బలోపేతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల కనుసన్నల్లోనే కవిత పనిచేస్తున్నారని, బీఆర్ఎస్‌ను బలహీనపరిచి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు. “తెలంగాణ రాకముందు వసూళ్ల కోసం వాడుకున్న సంస్థే జాగృతి. తెలంగాణ వచ్చాక రైతులకు సాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు బీసీ, ఎస్సీలకు నయాపైసా సాయం ఎందుకు చేయలేదు?” అని మధుయాష్కీ నిలదీశారు. బీసీల గురించి మాట్లాడుతున్న కవితకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాగృతి సంస్థను బీసీల చేతిలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మధుయాష్కీ గౌడ్ తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేస్తూ, కవితను ‘లేడీ మాఫియా డాన్’ అంటూ అభివర్ణించారు. ఆమె చేయని దందా లేదని, పాలుపంచుకోని స్కాం లేదని ఆరోపించారు. బతుకమ్మ పేరు చెప్పి కవిత బతుకు నేర్చిందని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి తప్పించుకోవాలంటే కవితకు బీజేపీ అండదండలు తప్పనిసరి అని, అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. జీఎస్టీ, దొంగ నోట్ల కుంభకోణాల్లోనూ కవితకు భాగస్వామ్యం ఉందని ఆయన బాంబు పేల్చారు.
కవిత నేతృత్వంలోని జాగృతి సంస్థపై సమగ్ర విచారణ జరపాలని మధుయాష్కీ గౌడ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. జాగృతి ఒక అవినీతి సంస్థగా మారిందని ఆయన ఆరోపించారు. “రాజీవ్ ప్రతాప్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు, స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో 800 కోట్ల రూపాయలు దోచుకున్నారు. జాగృతి కోసం ఫీనిక్స్ వంటి సంస్థల నుంచి కవిత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు” అని ఆయన ఆక్షేపించారు. ‘జై తెలంగాణ’ అని పిడికిలి బిగించి, రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఏ వ్యాపారం చేసి కవిత కోట్లాది రూపాయలు సంపాదించారో చెప్పాలని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
