AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇక్కడుంది సీబీఎన్.. ఖబడ్దార్..! సీఎం మాస్ వార్నింగ్..

అహంకారంతో విర్రవీగే వారికి వచ్చే ఎన్నికల్లో మరింత బుద్ధి చెబుతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కడపలో 10కి పది స్థానాలు టీడీపీ గెలుస్తుందన్నారు. రాయలసీమలో 52 సీట్లకు 45 సీట్లు కూటమి గెలుచుకుందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 శాతం స్ట్రైక్ రేట్‌తో అదిరిపోయే విజయం సాధించామని.. కార్యకర్తలే తన బలం, బలగం అని చెప్పారు. వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం పునర్ నిర్మరిస్తుందని తెలిపారు. కడప మహానాడు సూపర్ హిట్ అయిందన్నారు చంద్రబాబు.

 

వైసీపీ హయాంలో ఆర్థిక ఉగ్రవాదం

 

క్లైమోర్ మైన్స్‌కే భయపడలేదు.. కష్టాలు చూసి బెదిరిపోలేదు.. సవాళ్లు చూసి పారిపోలేదు.. కష్టపడి పని చేయడం తన విధానమని.. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం జీవిత ఆశయమని చెప్పారు చంద్రబాబు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తానని ప్రకటించారు. ఉగ్రవాదుల వల్ల దేశానికి.. ఆర్థిక ఉగ్రవాదుల వల్ల రాష్ట్రానికి నష్టమని అన్నారు. బీసీల కోసం బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామన్నారు. ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు.

 

సీమపై వరాల జల్లు..

 

రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని.. ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చి దిద్దుతానని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, కడపలో హజ్‌హౌజ్ త్వరలోనే సాకారం అవుతుందని చెప్పారు. జూన్ 12 లోగా కడపలో రాయలసీమ స్లీట్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.

 

ఇక్కడుంది సీబీఎన్.. ఖబడ్దార్

 

ఆడబిడ్డల జోలికి వచ్చినా.. డ్రగ్స్, గంజాయి అమ్మినా.. అదే వారికి ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ హయాంలో ల్యాండ్, శాండ్, మైన్స్ దోచేశారని.. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తానని.. ఇక్కడ ఉంది సీబీఎన్.. గుర్తు పెట్టుకోండి.. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.

 

మహానాడు మాస్ జాతర.. చెలరేగిన లోకేశ్

 

అంతకుముందు, మాస్ జాతర మహానాడు అదిరిపోయిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందన్నారు. 2024లో టీడీపీ కార్యకర్తల నాటు దెబ్బ చూపించామని.. వైసీపీ అడ్రస్ లేకుండా చేశామని చెప్పారు. చంద్రబాబును జైల్లో పెడితే.. ప్రజలు జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టి లాక్ చేశారని అన్నారు. అధికారం నెత్తికెక్కితే ఏం జరుగుతుందో వైసీపీని చూసి తెలుసుకోవాలన్నారు. వైసీపీ హయాంలో హానికర మద్యంతో 30వేల మందిని బలి తీసుకున్నారని.. రూ.వేల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. వైసీపీకి వార్నింగ్ ఇస్తూనే, సొంత పార్టీ కార్యకర్తలకు సూచనలు చేశారు లోకేష్. రెడ్ బుక్‌ను మరోసారి గుర్తు చేశారాయన.

 

జలీల్ ఖాన్ అస్వస్థత..

 

మరోవైపు, మహానాడు బహిరంగ సభా వేదికపై కళ్లు తిరిగి కింద పడిపోయారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను కార్యకర్తలు స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఎక్కించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ANN TOP 10