ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. పూర్తి ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్ పోరుకు అర్హత సాధించగా, పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరేందుకు క్వాలిఫయర్-2లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చండీగర్‌లోని ముల్లన్‌పూర్ మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్సీబీ బౌలర్లు ఆది నుంచే పంజాబ్ బ్యాటర్లపై నిప్పులు చెరిగారు. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. సాల్ట్ కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ (13 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడాడు. చివర్లో కెప్టెన్ రజత్ పటీదార్ (8 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సాల్ట్‌తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 106 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. పవర్ ప్లేలో ఆర్సీబీ 61 పరుగులు చేసింది.
టోర్నీలో ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. రేపు గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ తో తలపడాల్సి ఉంటుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ జూన్ 1న జరగనుంది. క్వాలిఫయర్-2లో నెగ్గిన జట్టు ఫైనల్లో ఆర్సీబీతో ఆడుతుంది.
