బీఆర్ఎస్ లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. చివరకు చీలిక తప్పదని తేలిపోయింది. తండ్రి కేసీఆర్ కి కవిత రాసిన లేఖ బహిర్గతం కావడంతో అసలు గొడవ మొదలైంది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పిన కవిత ఆ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. ఆమె ఆ మాట చెప్పినప్పుడే ఆ దెయ్యాలతో కలసి తాను పార్టీలో ఉండలేనని చెప్పినట్టయింది. కేసీఆరే తమ నాయకుడంటూ కవరింగ్ గేమ్ మొదలు పెట్టినా కూడా కవిత బీఆర్ఎస్ లో ఇక ఉండలేరని అర్థమైంది. ఎయిర్ పోర్ట్ లో ఆమెకు స్వాగతం పలికే క్రమంలో అనుచరులు కనీసం బీఆర్ఎస్ జెండా కానీ, కేసీఆర్ ఫొటో కానీ లేకుండా వచ్చారంటే దానికి పరోక్షంగా అదే అర్థం. అయితే ఆ అనుమానాలకు బలాన్నిచ్చేలా నేడు కవిత, తన అనుచరులతో మీటింగ్ పెట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి ఆమె సిద్ధమైనట్టు సిగ్నల్స్ ఇచ్చారు.
బుజ్జగింపులు..
కవిత కాకమీద ఉండటంతో బీఆర్ఎస్ లోని కొందరు పెద్దలు ఆమెతో సంప్రదింపులు జరిపారు. ఆమెకు నచ్చజెప్పడానికి వారు ప్రయత్నించారు. అయితే వారి మాట కవిత వినలేదు. తాను బీఆర్ఎస్ లో ఉండలేనని ఆమె తేల్చి చెప్పారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుని కూడా ఆమె కొట్టిపారేయలేదు. స్వయంగా కేసీఆర్ కూడా ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినా సాధ్యపడలేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఆ స్థాయిలో మాటలు జరిగితే.. కవితకు అసలు ఆ లేఖ రాయాల్సిన పరిస్థితి కూడా ఉండేది కాదేమో. కనీసం తండ్రీ కూతుళ్ల మధ్య మాటలు కూడా లేకపోవడం వల్లే కవిత లేఖ రాయాల్సి వచ్చిందని, దాన్ని కొందరు బయటపెట్టారని అంటున్నారు.
కొత్త పార్టీకి సై..
బీఆర్ఎస్ నేతలతోపాటు.. కొంతమంది జాగృతి నేతలు కూడా కవితను కలసిన వారిలో ఉన్నారు. జాగృతి నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆమె కొత్త పార్టీపై వారికి హింటిచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్-2న కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేత రఘునందన్ రావు కూడా జూన్-2న కవిత కొత్త పార్టీ పెడతారంటూ కచ్చితంగా చెబుతున్నారు.
సంచలనం..
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, తదనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ, ఆలె నరేంద్ర తెలంగాణ సాధన సమితి కూడా అప్పటి టీఆర్ఎస్ లో విలీనం అయ్యాయి. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారు పెట్టిన పార్టీలు పెద్దగా మనలేదు. ఈసారి మాత్రం పరిస్థితి అంత సింపుల్ గా లేదు. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తోంది కేసీఆర్ కుమార్తె. కవిత పార్టీ పెడితే కచ్చితంగా బీఆర్ఎస్ లో చీలిక రావడం ఖాయం. ఇప్పటికే అధికారం కోల్పోయి నేతలంతా తలో దిక్కుకు పోయి కిందామీదా పడుతున్న బీఆర్ఎస్ కి ఇది గోరు చుట్టుపై రోకలిపోటులా మారడం ఖాయం. అందుకే బీఆర్ఎస్ నేతలు కవిత బయటకు పోకూడదని అనుకుంటున్నారు.
కవిత వర్సెస్ కేటీఆర్..
కేసీఆర్ దేవుడు అన్న కవిత, కేటీఆర్ పేరెత్తకపోవడం విశేషం. కేటీఆర్ విషయంలో కవిత కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. కవిత ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు. పార్టీలో ఎవరూ గీతదాటకూడదని, ఏవిషయం అయినా అధినేత దృష్టికి తీసుకురావాలి కానీ బహిరంగ వేదికలపై మాట్లాడకూడదన్నారు. దీంతో కవితకు, కేటీఆర్ కి మరింత దూరం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ దశలో కవిత పార్టీ పెడితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కి అది మరింత ప్రమాదం అనే విషయం తేలిపోయింది. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే, కేటీఆర్ ని సీఎంగా చేస్తారని అందరూ అంచనా వేశారు. ఆ అంచనా తలకిందులవడంతోపాటు.. సమీప భవిష్యత్ లో కేటీఆర్ కి సీఎం యోగం లేదని తేలిపోతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బహుముఖ పోరు బీఆర్ఎస్ కి ఏమాత్రం లాభం చేకూర్చదు. కవిత రాజకీయంగా నిలదొక్కుకుంటే.. ఆమె ఏదో ఒక పార్టీతో కూటమి కట్టాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చే కవిత, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని అనుకోలేం. మొత్తమ్మీద కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం ఖాయమైపోయింది. కొత్త పార్టీ ప్రకటనే ఇక మిగిలుంది.