ఏపీలో మద్యం కుంభకోణం విచారణ చివరి దశకు చేరుకుందా? ఈవారంలో మరిన్ని అరెస్టులు తప్పవా? బుధవారం నుంచి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ విచారణలోకి దిగిందా? చివరి లబ్దిదారుడి కోసం వివరాలు సేకరించిందా? ఈడీ ఎవర్ని అరెస్టు చేయబోతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది.
గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినవారిని వదిలేది లేదని కుండబద్దలు కొట్టేశారు సీఎం చంద్రబాబు. కడప మహానాడు మంగళవారం ప్రారంభోత్సవ స్పీచ్‌లో ఇదే విషయాన్ని వెల్లడించారు. కాకపోతే ముందు వెనుక ఉండవచ్చు కానీ, ఊచలు లెక్కబెట్టడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు.
సీఎం చంద్రబాబు స్టేట్‌మెంట్ ఇచ్చిన కొద్ది గంటలకే లిక్కర్ కేసులోకి ఈడీ ఎంటరైంది. బుధవారం సిట్ అధికారులతో సమావేశమయ్యారు. వారి నుంచి కీలకమైన వివరాలు తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు జరిగిన తీరుపై చర్చించారు. ముడుపులు సేకరించిన నుంచి వాటిని మళ్లించిన వరకు కీలక వివరాలు ఈడీకి వివరించారు.. ఆపై ఆధారాలు అందజేశారు.
డిస్టిలరీస్ నుంచి కమీషన్లు ఏ రూపంలో ఎంత తీసుకున్నారు? ముడుపులు చేరిన మార్గం, అంతిమ లబ్ధిదారుడి గుట్టు తేల్చే పనిలో పడింది. రియల్ ఎస్టేట్ లింకులు, బినామీల ద్వారా బెంగళూరులో భారీగా ఆస్తులు, బంగారం కొనుగోళ్లకు సంబంధించి కీలక డేటాను ఈడీకి అందజేసింది సిట్. ఈ స్కామ్‌లో కింగ్‌పిన్‌గా ఉన్న రాజ్ కసిరెడ్డితోపాటు మిగతా నిందితులు ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయో కీలక విషయాలు బయటపెట్టారు.
తాడేపల్లి నుంచి ఐదేళ్ల పాటు తిరుగులేని హవా నడిపించిన కొందరు అధికారులను విచారించిన తర్వాత అంతిమ లబ్దిదారుడు ఎవరు అనేది తేల్చనుంది. ఆ తర్వాత అరెస్టులు ఉంటాయని అంటున్నారు. రాజ్ కసిరెడ్డిని బుధవారం విజయవాడ జైలులో విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ దర్యాప్తులో కసిరెడ్డి ఇచ్చే సమాచారం కీలకం కానుంది.
ఈ కేసులో ఈడీ టీమ్ విజయవాడకు వచ్చిందన్న విషయం తెలియగానే వైసీపీలో చిన్నపాటి అలజడి మొదలైంది. నిందితులు ఎలాంటి సమాచారం అధికారులకు ఇచ్చారో తెలీదు. ఈ కేసులో మాగ్జిమమ్ అందర్నీ అదుపులోకి తీసుకుంది. కాకపోతే ఇద్దరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈడీ వారిని అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు. అదే జరిగితే మరో రెండేళ్ల వరకు బెయిల్ రావడం కష్టమని అంటున్నారు. దశాబ్దమున్నర కిందట సమాచారం, టెక్నాలజీ ఆధారంగా ఈడీ అడుగులు వేసిందని అంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత నిధులు ఏ రూపంలో ఎటువైపు వెళ్తాయో డొంకంతా లాగడం మరింత ఈజీ అవుతుందని అంటున్నారు. ఈడీ బోనులోకి చిక్కేదెవరో?