పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ హర్యానాలోని హిసార్ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత గురువారం ఆమె పోలీస్ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.
వివరాల్లోకి వెళితే, జ్యోతి మల్హోత్రాను మొదట ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఆ గడువు ముగిసిన అనంతరం, విచారణాధికారులు చేసిన అభ్యర్థన మేరకు కోర్టు మరో నాలుగు రోజులు పోలీస్ కస్టడీని పొడిగించింది.
ఈ పొడిగించిన రిమాండ్ కూడా గత గురువారంతో పూర్తి కావడంతో, ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పాకిస్థాన్ కోసం గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇప్పటివరకు పది మందికి పైగా అరెస్టయ్యారు.