AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్….

దేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో భారత్.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జపాన్‌ను అధిగమించి ముందుకు దూసుకెళ్లింది. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. మరో మూడేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్.. క్రమంగా ఎదుగుతూ నాలుగో స్థానానికి ఎగబాకింది.

 

తాజాగా ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ చేరుకోవడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మోదీ దార్శనిక నాయకత్వానికి, NDA ప్రగతిశీల పాలనకు ఇది నిదర్శనమన్నారు. గత దశాబ్ధి కాలంలో భారత్‌ అనేక రంగాల్లో వృద్ధి సాధించింది. ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదని.. ప్రపంచంలోనే నవ భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోందన్నారు. వికసిత్‌ 2047 వైపు నడిచేందుకు ఇది ప్రధానమైన అడుగని పవన్‌కల్యాణ్ తెలిపారు.

 

కాగా.. రాష్ట్రాల అభివృద్ధిలో వేగం పెంచాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడిన మోదీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాగా కలిసి పనిచేయాలని కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్‌తో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పనిచేయడం కూడా అభివృద్ధికి సంకేతం అని తెలిపారు.

 

దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం ప్రతి రాష్ట్రం ఓ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎంలకు తెలిపారు. పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు దాడి చేసినా దేశం దృఢంగా ఉందన్నారు మోదీ. పర్యాటకం ద్వారా కేవలం ఒక ప్లేసో.. ఓ ప్రాంతమే కాకుండా చుట్టుపక్కలున్న నగరాలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. దేశం పట్టణీకరణ వైపు వేగంగా కదులుతోందని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు మోదీ. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం దృఢనిశ్చయంతో ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు బాంబులు, గన్స్, ఆందోళనలకు మారుపేరుగా ఉండేవి. దానివల్ల యువత ఎన్నో అవకాశాలను కోల్పోయారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో 10 వేల మందికిపైగా యువత ఆయుధాలను వదిలిపెట్టారని అన్నారు.

 

ఇతర రాష్ట్రాలు చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రశంసలు కురిపించారు మోదీ. నీతి ఆయోగ్ కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు.. పీ4 కార్యక్రమాలు, ఎన్టీయే ప్రభుత్వాల ఏడాది పాలన గురించి వివరించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్న తీరును తెలిపారు. ప్రజెంటేషన్ పూర్తిగా విన్న మోడీ.. వికసిత్ భారత్ 2047కోసం చంద్రబాబు ఇచ్చిన సూచనలను ప్రశంసించారు.

 

నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత పలు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి రాష్ట్రాలకు కావాల్సిన నిధులు సమకూర్చాలని, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.

ANN TOP 10