AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ హిమాలయ పర్వతాల వంటివారు.. ఎవరికీ తల వంచరు: పవన్ కల్యాణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓట్ల గురించి ఆలోచించరని, దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో, అదే విధంగా మోదీ కూడా ఎక్కడా, ఎవరికీ తలవంచరని ఆయన ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

 

దేశ ప్రగతికి ప్రధాని మోదీ ఇస్తున్న ప్రాధాన్యతకు ‘పీఎం-జన్ మన్’ కార్యక్రమమే నిదర్శనమని పవన్ తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ ఓట్ల గురించి ఆలోచించరు. దేశాభివృద్ధే లక్ష్యంగా ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు (పీవీటీజీ) నివసించే ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించగలుగుతున్నాం” అని ఆయన వివరించారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “పీఎం-జన్ మన్” పథకం అమలు తీరును వివరిస్తూ, “కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.555.61 కోట్ల నిధులతో రాష్ట్రంలో 612.72 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తున్నాము. ఇవన్నీ పీవీటీజీ ఆవాసాలను కలిపే రోడ్లే. వీటి ద్వారా ఏడు జిల్లాల్లోని 239 పీవీటీజీ ఆవాసాలకు రోడ్డు మార్గాలు ఏర్పడుతున్నాయి. తద్వారా సుమారు 50 వేల మంది గిరిజనులకు రవాణా సౌకర్యం కలుగుతుంది” అని పవన్ పేర్కొన్నారు. ఓట్లు వస్తాయో లేదో అని చూడకుండా, ప్రతి ఒక్కరికీ, అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు అందాలన్నదే ప్రధాని సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తితోనే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

 

“ఆపరేషన్ సిందూర్” వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రజల రక్షణతో పాటు వారి భవిష్యత్తు గురించి ప్రధాని మోదీ ఆలోచించారని, దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఆయనదేనని పవన్ కల్యాణ్ కొనియాడారు.

 

కుల గణన ఆవశ్యకతను కూడా ఆయన నొక్కి చెప్పారు. “దేశంలో ఉన్న కులాల పరిస్థితులు, వారి జీవన విధానం, వృత్తులు, స్థితిగతులు తెలుసుకోవడానికి కుల గణన ఎంతో అవసరం. వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ పథకాలు తీసుకురావాలో పాలకులకు స్పష్టత వస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

 

అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిందని పవన్ వెల్లడించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలో మూడు నెలల పాటు పర్యటించి రూపొందించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ANN TOP 10