AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుజరాత్‌లో మరో పాక్ గూఢచారి అరెస్ట్..!

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై గుజరాత్‌లో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కచ్ సరిహద్దు ప్రాంతంలో సహదేవ్ సింగ్ గోహిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అధికారులు వెల్లడించారు. నిందితుడు దయాపూర్‌, కచ్‌ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

 

సహదేవ్‌కు 2023లో వాట్సప్‌ ద్వారా అదితి భరద్వాజ్ అనే పేరుతో ఒక యువతి పరిచయమైందని ఏటీఎస్ అధికారి సిద్ధార్థ్ మీడియాకు వివరించారు. అప్పటినుంచి ఆమెతో నిందితుడు టచ్‌లో ఉన్నాడని, భారత వైమానిక దళం (ఐఏఎఫ్), సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చేపడుతున్న నూతన నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను, నిర్మాణంలో ఉన్న ప్రదేశాల దృశ్యాలను ఆమెకు పంపినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మే ఒకటవ తేదీన సహదేవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

 

నిందితుడు సహదేవ్ నుంచి సమాచారం సేకరించిన ఫోన్ నంబర్లు పాకిస్థాన్‌లో చలామణిలో ఉన్నాయని ఫోరెన్సిక్ పరీక్షల్లో నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. ఈ సమాచారం చేరవేసినందుకు గాను, గుర్తుతెలియని వ్యక్తి ద్వారా నిందితుడికి రూ.40 వేలు అందినట్లు కూడా గుర్తించామన్నారు.

ANN TOP 10