AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై ఆయన ప్రధానికి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

 

సమావేశంలో భాగంగా హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రధానిని అభ్యర్థించారు. ఈ విషయంలో పట్టణాభివృద్ధి శాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు వ్యూహాత్మకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర, దక్షిణ భాగాలకు ఒకేసారి ఆర్థిక, మంత్రివర్గ అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి అవసరమైన భూసేకరణ ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

అంతేకాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా ఒక గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే లైన్‌ను నిర్మించే ప్రతిపాదనకు కేంద్రం సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వాణిజ్య, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ సమీపంలో ఒక డ్రై పోర్టును ఏర్పాటు చేయాలనే ఆలోచనను కూడా ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేందుకు ప్రత్యేకంగా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు మార్గంతో పాటు గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే లైన్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10