తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఉగ్రవాదుల అరెస్ట్. ఇదే ఓ షాకింగ్ విషయం అనుకుంటే.. ఇప్పుడు వీరిని విచారిస్తే వణుకుపుట్టించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి అరెస్ట్ ఇంకాస్త లేట్ అయితే మరిన్ని దారుణాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ సిరాజ్ కన్ఫేషన్ రిపోర్టులో ఏముంది?
సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ విస్తరించాలనే ప్లాన్
సౌదీ, ఒమన్ నుంచి సిరాజ్‌కు అందిన సహకారం
హైదరబాద్, వరంగల్, యూపీలో కూడా లింక్‌లు
భారీగా పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తింపు
విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు తెలిపాడు సిరాజ్. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ మొదట ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. సిరాజ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన సమీర్, వరంగల్‌కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్‌తో కలిసి ఉగ్రవాద గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. జకీర్ నాయక్, ఇస్రార్ అహ్మద్, షేక్ యాకుబ్ జమాలి, షేక్ జావిద్ రబ్బాని ప్రసంగాలతో ప్రభావితమైన ఈ గ్రూప్.. ఏకంగా అల్ హింద్ ఇతహదుల్ ముస్లిమీన్.. సింపుల్‌గా చెప్పాలంటే అహిం పేరుతో ఓ రాడికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈగ్రూప్‌ను దేశవ్యాప్తంగా విస్తరించి.. యువతను మతోన్మాదంవైపు ఆకర్షించాలనేది వీరి ప్లాన్.
ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్న సిరాజ్ అండ్ గ్రూప్
ఇదే కాన్సెప్ట్‌తో ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్నారు సిరాజ్ అండ్ గ్రూప్. అక్కడ మరికొంత మందితో పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా పర్యటించి కొందరిని కలిసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఆ తర్వాత వీరికి సౌదీ నుంచి ఆదేశాలు రావడం ప్రారంభమైంది. బీహార్ నుంచి సౌదీకి వెళ్లి అక్కడే ఉంటున్న అబుతలేం అలియాస్ అబు ముసాబ్ సూచనలతో చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
తక్కువ ఖర్చుతో IED బాంబుల తయారీకి ప్రయత్నాలు
భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలన్నది వీరి ప్లాన్. అబు సూచలనతో తక్కువ ఖర్చుతో IED బాంబుల తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టాడు సిరాజ్. ముస్లిం యువతను మతోన్మాదం వైపు నడిపేందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యామని సిరాజ్ చెబుతున్నాడు. మరో హైలెట్ ఏంటంటే.. బాంబుల తయారీకి అవసరమైన డబ్బులు వీరికి ఒమన్ నుంచి అందాయి. ఒమన్‌లో పనిచేస్తున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ ఖాన్ ఈ డబ్బును పంపాడు. అవసరమైతే మరింత పంపుతానని తెలిపాడు.
అమ్మెనియం నైట్రేట్, సల్ఫర్ అల్యూమినియం పౌడర్ కొనుగోలు
బాంబుల తయారీకి ఆన్‌లైన్‌లో అమోనియం నైట్రేట్, సల్ఫర్ అల్యూమినియం పౌడర్‌ను కొనుగోలు చేసింది సిరాజ్ టీమ్. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు.. స్థానిక దుకాణాల్లోనూ సామాగ్రి కొనుగోలు చేశారు. దీపావళి టపాసుల మందుగుండు సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు. విజయనగరంలో రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చడానికి సిరాజ్ కుట్ర పన్నాడు. అయితే పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ అయ్యాడు. అతని బైక్ హ్యాండిల్‌కు ఉన్న సంచిలో నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
సిగ్నల్ యాప్‌లో నిరంతరం టచ్‌లో ఉన్న గ్రూపు
వీరంతా నిత్యం టచ్‌లో ఉండేందుకు సిగ్నల్ యాప్‌ను వాడారు. సిగ్నల్ యాప్‌లో సిరాజ్-సమీర్ మధ్య చాటింగ్ జరిగింది. డబ్బులు అందితే ఓ స్కూల్ పెట్టి.. అందులోని కెమికల్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేయొచ్చంటూ చాటింగ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ నేతలను టార్గెట్ చేద్దామంటూ డిస్కషన్ చేసుకున్నారు. ఒక రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలో తెలిసిందంటూ మాట్లాడుకున్నారు.
NIA విచారణలో మరిన్ని విషయాలు
మొత్తానికి వీరిద్దరి అరెస్ట్‌తో ఓ కొత్త మాడ్యుల్ ఇప్పుడు తెరపైకి వచ్చినట్టు అర్థమైంది. మరి NIA విచారణలో ఇంకెన్ని విషయాలు బయటికి వస్తాయో.. ఇంకెంత మంది దొరికిపోతారో చూడాలి. ఇదే సమయంలో సిరాజ్ కుటుంబసభ్యుల తీరుపై కూడా కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
STF కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సిరాజ్ అన్న
ప్రస్తుతం ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరాజ్.. ASIగా పనిచేస్తున్న రెహ్మాన్ కొడుకు. అంతేకాదు అతని సోదరుడు టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సిరాజ్ టెర్రరిస్టులతో చేతులు కలిపిన సంగతి కుటుంబ సభ్యులకు ముందే తెలుసా? అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. సిరాజ్‌కున్న విజయనగరం సహకార బ్యాంక్ అకౌంట్‌లో 42 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. సహకారబ్యాంక్ అకౌంట్‌లో అంత డబ్బు ఎలా వచ్చింది..? అనేది తేలాల్సి ఉంది.
ముందు సివిల్ డ్రెస్స్‌లో ఆతర్వాత యూనిఫామ్‌లో
సిరాజ్ అరెస్టయ్యాక డీసీసీబీ బ్యాంక్‌లో అతనికున్న లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు తండ్రి రెహ్మాన్. ముందు సివిల్ డ్రెస్‌లో, తర్వాత యూనిఫామ్‌లో బ్యాంక్‌కు వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి రెహ్మాన్ ప్రయత్నించాడు. NIA అధికారులు ముందుగానే హెచ్చరించడంతో రెహ్మాన్‌ను అనుమతించలేదు బ్యాంక్ సిబ్బంది.
సిరాజ్ లాకర్ ను ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడు?
సిరాజ్ లాకర్‌ను ఆయన తండ్రి ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడు? ఇంట్లో ఇద్దరు పోలీసులుండీ సిరాజ్ కదలికలను ఎందుకు కనిపెట్టలేదు? విజయనగరంలోనే బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినా ఎందుకు తెలుసుకోలేకపోయారు? సిరాజ్ బ్యాంక్ అకౌంట్‌లోకి అన్ని లక్షల డబ్బు వస్తే ఎందుకు నిలదీయలేదు..? ముందుగానే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు..? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు రావాల్సి ఉంది. సిరాజ్ తండ్రి, సోదరుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు NIA అధికారులు.
పేలుడు పదార్థాల కేసులో ముగ్గురు వ్యాపారులు అదుపులోకి
మరోవైపు పేలుడు పదార్థాల కేసులో కన్యకాపరమేశ్వరి కోవెల ప్రాంతంలో ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ముగ్గురూ అనధికారికంగా వివిధ రకాల పేలుడు పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. వీరి వద్ద సిరాజ్ కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్టుగా అనుమానిస్తున్నారు. క్వారీ బ్లాస్ట్‌లకు సంబంధించి వీరు అనధికారికంగా పేలుడు పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని మొదటగా బిగ్ టీవీ ధ్రువీకరించింది. విజయనగరం మార్కెట్ ప్రాంతంలో కొందరు వ్యాపారస్తులు అనధికారికంగా పేలుడు పదార్థాలను అమ్ముతున్నట్టు బిగ్ టీవీ ఉందే ముందే చెప్పింది.