ఏదైనా సమాచారం కావాలంటే చాలామంది వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఈ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ వాడేవారు తక్షణమే స్పందించాలని సూచించింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In), క్రోమ్ బ్రౌజర్లో కొన్ని తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు, అంటే హ్యాకర్లు, యూజర్ల ల్యాప్‌టాప్‌ల నుంచి విలువైన వ్యక్తిగత సమాచారం, డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని CERT-In స్పష్టం చేసింది.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు చెందిన పాత వెర్షన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని, వీటి ద్వారా హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్లను సులువుగా తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని CERT-In తన నివేదికలో పేర్కొంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై క్రోమ్ వాడేవారు 136.0.7103.114 వెర్షన్ కంటే పాతవి వాడుతుంటే ఈ ముప్పు పొంచి ఉందని తెలిపింది. అదేవిధంగా, మ్యాక్ లేదా లైనక్స్ యూజర్లు అయితే, 136.0.7103.113 కంటే ముందున్న వెర్షన్లలో ఈ లోపాలు ఉన్నాయని CERT-In వివరించింది. ప్రధానంగా రెండు రకాల బగ్స్ (లోపాలు) ఈ ముప్పునకు కారణంగా గుర్తించారు.
వాటిలో మొదటిది CVE-2025-4664. క్రోమ్‌లోని ఈ బగ్, బ్రౌజర్ లోడర్ వ్యవస్థను సరిగ్గా అమలు చేయడంలో విఫలమవుతుంది. దీనిని అదునుగా తీసుకుని హ్యాకర్లు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ద్వారా యూజర్ల కంప్యూటర్ నుంచి డేటాను దొంగిలించగలరు. ఇక రెండోది CVE-2025-4609. ఈ బగ్ క్రోమ్ మోజో అనే కాంపోనెంట్లో ఉంది. ఇది హ్యాండ్లింగ్ విషయంలో సమస్యను సృష్టిస్తుంది. దీన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు యూజర్ల సిస్టమ్‌లోకి చొరబడే ప్రమాదం ఉంది.
రక్షణకు ఏం చేయాలి?
ఈ ప్రమాదకరమైన బగ్స్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి, యూజర్లు తమ కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ యొక్క తాజా వెర్షన్‌ను ఉపయోగించాలని CERT-In స్పష్టంగా సూచించింది. ఇందుకోసం క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేయడానికి, ముందుగా మీ కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్‌ను తెరవాలి. ఆ తర్వాత, కుడివైపు పైభాగంలో కనిపించే మూడు చుక్కల (మెనూ) గుర్తుపై క్లిక్ చేయాలి. ఇప్పుడు కనిపించే ఆప్షన్లలో ‘హెల్ప్’ (Help) ఆపై ‘ఎబౌట్ గూగుల్ క్రోమ్’ (About Google Chrome) పై క్లిక్ చేయాలి. ఇలా చేసిన వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్‌గా తాజా వెర్షన్‌కు అప్డేట్ అవుతుంది. ఈ చిన్న ప్రక్రియ ద్వారా మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.