ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. పురుషులంటే ఇష్టం లేని ఇద్దరు స్నేహితురాళ్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయం ఈ అరుదైన వివాహానికి వేదికగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న ఈ యువతులు, ఇకపై జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమ వివాహానికి న్యాయపరమైన మద్దతు కోరుతూ కోర్టు ప్రాంగణంలో ఓ న్యాయవాదిని సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశం కల్పించాలని వారు అభ్యర్థించారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని సదరు న్యాయవాది వారికి స్పష్టం చేశారు.
అయినప్పటికీ, ఆ యువతులు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. పురుషులతో కలిసి జీవించడం తమకు ఇష్టం లేదని, తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా, చట్టం తమ వివాహాన్ని గుర్తించకపోయినా తాము కలిసే జీవిస్తామని దృఢంగా పేర్కొన్నారు. అనంతరం, కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఈ ఘటన, స్వలింగ సంబంధాలు, వివాహాలపై దేశంలో జరుగుతున్న చర్చకు అద్దం పడుతోంది.