AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ గూటికి చేరిన జాకీయా ఖానమ్..!

వైసీపీ నాయకురాలు, శాసన మండలి వైస్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన జాకీయా ఖానమ్ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2022లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జాకీయా ఖానమ్ గత రెండేళ్లుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.

 

ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి, శాసన మండలి వైస్ చైర్మన్ పదవికి రాజీనామా లేఖ పంపిన అనంతరం ఆమె విజయవాడలోని బీజేపీ కార్యాలయానికి చేరుకుని, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

 

మతతత్వ పార్టీ అని, మైనార్టీలు బీజేపీకి దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ముస్లిం మైనార్టీకి చెందిన మహిళా నేత జాకీయా ఖానమ్ ఆ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలో ఎందుకు చేరారనే విషయంపై ఆమె స్పందిస్తూ, ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకే తాను పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు.

 

ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, బీజేపీ నినాదం ‘సబ్ కే సాత్.. సబ్ కా వికాస్’ అని, పార్టీలో కుల మతాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతం అని ఆమె అన్నారు. శాసన మండలి వైస్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసి జాకీయా ఖానమ్ బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మైనార్టీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జాకీయా ఖానమ్ చేరికతో మరోసారి రుజువైందని పురంధేశ్వరి అన్నారు.

 

మైనార్టీలకు బీజేపీలో మంచి స్థానం ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. జాకీయా ఖానమ్ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని గుర్తు చేశారు. జాకీయా ఖానమ్‌ను మనస్ఫూర్తిగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని ఆమె అన్నారు. కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆ దిశగానే దేశానికి బీజేపీ సుపరిపాలన అందిస్తోందని ఆమె తెలిపారు.

ANN TOP 10