రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “అక్కడ (గతంలో పనిచేసిన చోట) చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా” అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా బాధ్యతలు నిర్వర్తించిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ, పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్) సమస్యలు పూర్తిగా పరిష్కారమై, పంపుహౌస్‌ల పనులు ప్రారంభమైన తర్వాతే పైపులకు సంబంధించిన బిల్లులు సమర్పించాలని మహబూబ్‌నగర్ సీఈకి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. గతంలో జరిగిన పొరపాట్లను ప్రస్తావిస్తూ, అలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నమోదు చేసిన కేసుల్లో సంబంధం ఉన్న వారిపై చర్యలు కచ్చితంగా ఉంటాయని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అయితే, ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేని అధికారులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్మాణంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఒకటి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల విజిలెన్స్ కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా బాధ్యతగా పనిచేయాలని అధికారులకు ఉద్బోధించినట్లు సమాచారం.
సమావేశంలో ఒప్పంద సేవల ఉద్యోగుల వేతనాల అంశాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, అవసరం ఉన్నంత వరకే కాంట్రాక్టు సిబ్బందిని నియమించుకోవాలని, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ప్రతిపాదనలు అందిన తర్వాత పరిశీలిస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల (ఓ అండ్ ఎం) కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లులకు నెలకు రూ.50 కోట్లు, నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ. 75 కోట్ల వరకు కేటాయింపులు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. శిక్షణ సంస్థ వాలంతరికి రూ.10 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు చేపట్టాల్సిన పనులకు రూ.10 కోట్లు, దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తికి రూ.2 వేల కోట్లు అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది.