తెలంగాణలో యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాజీవ్ యువ వికాసం పేరుతో రూపొందించిన ఈ పథకం ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందనుంది. అయితే ఈ పథకం ఎంపిక ప్రక్రియలో సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారనే వార్తలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.
భట్టి విక్రమార్క తాజా ప్రకటనలో, సిబిల్ స్కోర్ తప్పనిసరి అనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇందులో ఎవ్వరూ అపోహపడవద్దు. ఎంపిక ప్రక్రియ మండల స్థాయిలో కొనసాగుతోంది. జూన్ 2వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
ఈ పథకం ద్వారా యువతకు రూ.50,000 నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. లబ్ధిదారుల ఆర్ధిక స్థితిగతులు, ప్రాజెక్ట్ అవసరాలు, కేటగిరీలను బట్టి మంజూరు మొత్తం నిర్ణయించబడుతుంది. ఇది ప్రత్యక్ష నిధుల రూపంలో ఇవ్వబడే సాయం కావడంతో యువతకు ఇది నిజమైన ఉపాధి మార్గం కానుంది.
ఇప్పటికే జిల్లాల వారీగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. నిరుద్యోగ యువత ఈ పథకాన్ని ఉపయోగించుకుని, చిన్న వ్యాపారాలు, సేవా రంగాల్లో తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని స్వతంత్రంగా ఎదగవచ్చు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక తోడ్పాటుతో పాటు, అవసరమైతే మౌలిక సదుపాయాలు, శిక్షణ కూడా అందించనున్నారు.
ఈ పథకం ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కొత్త అవకాశాలు అందుతాయని అంచనా. ఇప్పటివరకు ఇతర జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే యువతకు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా నిలవనుంది. యువతకు ఉద్యోగాన్ని ఇచ్చే బదులు ఉద్యోగదాతలుగా తీర్చిదిద్దే ప్రయత్నమే ఈ పథకం వెనక ఉన్న లక్ష్యంగా చెప్పవచ్చు.
ఇటువంటి పథకాల ద్వారా ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజల వద్దకు చేర్చడం సాధ్యమవుతుంది. యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్ర మరింత బలపడుతుంది. అందుకే ప్రభుత్వం చేపట్టిన ఈ అడుగు, యువత భవిష్యత్తుకు మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.