ఒకొక్కరుగా నేతలు వైసీపీకి రాంరాం చెప్పేస్తున్నారు. పార్టీ అధికారం పోయి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. ప్రస్తుతం పార్టీ పరిస్థితులను గమనించిన నేతలు, ఆ పార్టీలో లైఫ్ ఉండదని భావించారు. తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతున్నారు. తాజాగా మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానమ్ వంతైంది.
వైసీపీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ సీఎం జకియా ఖానమ్. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ మండలి ఛైర్మన్ మోషేర్ రాజుకు లేఖ రాశారు. ఆ లేఖను తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఛైర్మన్‌కు పంపారు.
జకియా ఖానమ్ సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2020 జులైలో గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేసింది వైసీపీ. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియాఖానమ్ వైసీపీలో సైలెంట్‌గా ఉన్నారు. కొంత కాలంగా కూటమిలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు జకియా ఖానమ్ తిరుమల దర్శనం టికెట్ల వ్యవహారంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదైంది. గతేడాది అక్టోబర్ 21న తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగుళూరుకు చెందిన ఓ భక్తుడు శ్రీవారి దర్శనం టికెట్లను రూ.10వేల కొనుగోలు చేసినట్టు అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై రూ.500 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్‌ను కొనుగోలు చేసినట్టు అందులో ప్రస్తావించాడు. తమ నుంచి సదరు ఎమ్మెల్సీ సిబ్బంది రూ.65వేలు వసూలు చేసినట్టు పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో తిరుమల వన్‌టౌన్ పీఎస్‌లో జకియాతోపాటు ఓ దళారీ, ఆమె పీఆర్వోలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ గండం నుంచి గట్టెక్కేందుకు వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
సైలెంట్ గా ఉన్న జకియా అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో పార్టీలో తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్‌లతో జాకీయా ఖానమ్ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె మంగళవారం రాత్రి తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి, మండలి ఛైర్మన్‌కు పంపారని అంటున్నారు.
ఒకవేళ జకియా బీజేపీలో చేరితే ఆ సీటు మళ్లీ ఆమెకే వచ్చే అవకాశముందని అంటున్నారు. ఆమెతో కలిపి ఇప్పటి వరకు వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తన పదవులకు రాజీనామా చేశారు. వారిలో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ఉన్నారు. రానున్న రోజుల్లో మండలిలో వైసీపీ ఖాళీ అయిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు