AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అర్థరాత్రి పాకిస్తాన్‌కు సూర్యుడిని చూపెట్టాం.. కీలక విషయాలు చెప్పిన ప్రధాని మోదీ..!

భారత్ మాతాకీ జై అనే నినాదం శత్రువులకు నిద్రలేకుండా చేసిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అదంపూర్ ఎయిర్ బేస్ లో ఆయన త్రివిధ దళాలకు చెందిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. ఆపరేష్ సిందూర్ సాధారణమైన సైనిక విన్యాసం కాదని, అది భారత దేశ నీతి నియమాలకు, నిర్ణయానికి నిదర్శనం అని చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సామర్థ్యాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు. అణ్వాయుధాల పేరుతో పాకిస్తాన్ మనల్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందని, కానీ సమర్థవంతంగా వారి కుటిల పన్నాగాలను తిప్పికొట్టామన్నారు మోదీ. వారు వెనక నుంచి దాడి చేస్తే మనం ముందుండి పోరాడామన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మూడు విషయాలు అందరికీ తెలిసొచ్చాయన్నారు మోదీ. భారత్ పై ఉగ్రదాడి జరిగితే.. దాడి చేసిన వారి స్థానాలకే వెళ్లి, వారి ప్రాంతాల్లోనే వారిని మట్టుబెట్టగలమని మనం నిరూపించామన్నారు. అణ్వాయుధాల బ్లాక్ మెయిల్ ని మనం సహించబోమని, వారికి గట్టిగా జవాబు చెప్పామన్నారు. ఉగ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశాలను భారత్ విడివిడిగా చూడదని, వారందరికీ గుణపాఠం చెబుతామని నిరూపించామన్నారు మోదీ.

 

భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీరించిన అనంతరం తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ, అదంపూర్ లోని సైనిక స్థావరాన్ని సందర్శించడం ఆసక్తికరంగా మారింది. కేవలం సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసమే కాదు, ప్రధాని మోదీ పర్యటనకు మరో పరమార్థం కూడా ఉంది. అసలు మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ కి ఎందుకు వెళ్లారు..? అక్కడ ఆయన ఏం చేశారు..? మోదీ పర్యటన ద్వారా, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ మరోసారి ఎలా భంగపాటుకి గురైంది.

 

ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. అయితే అనూహ్యంగా ఇరు దేశాలు కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకున్నాయి. భారత దాడులను తట్టుకోలేని పాక్ చివరకు కాళ్లబేరానికి వచ్చిందని, నవయుగ యుద్ధంలో పాకిస్థాన్‌ ను భారత్‌ మట్టి కరిపించిందని అన్నారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండె పైనే కొట్టగలిగామని ప్రజలను ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు మోదీ. భారత ప్రజలకు సందేశాన్నిచ్చిన మరుసటి రోజు, ప్రపంచ దేశాలకు మరో సందేశాన్నిచ్చేందుకు మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ కి పయనమయ్యారు.

 

పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో అదంపూర్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ బేస్ ఉంది. 1950లో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఎయిర్ బేస్ ని నిర్మించింది. భారత్-పాక్ యుద్ధాల్లో ఈ ఎయిర్ బేస్ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. 1965 యుద్ధంలో పాకిస్తాన్ మన పఠాన్ కోట్, హల్వారా, అదంపూర్ ఎయిర్ బేస్ లపై దాడి చేసింది. హల్వారా, అధంపూర్ పై జరిగిన దాడులు విఫలమయ్యాయి. కార్గిల్ యుద్ధంలో కూడా అదంపూర్ ఎయిర్ బేస్ విశేష సేవలందించింది. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ఎయిర్ బేస్ పై మరోసారి దాడికి విఫలయత్నం జరిగింది. అదంపూర్‌ లోని ఎస్‌-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని పాక్‌ ప్రచారం చేసుకుంది. ఎయిర్ బేస్ లోని మౌలిక సదుపాయాలు, విద్యుత్, సైబర్‌ వ్యవస్థలపై దాడి చేసి ధ్వంసం చేశామని అన్నారు పాక్ అధికారులు. అయితే అదంతా అసత్యం. పాకిస్తాన్ వండి వార్చే ఫేక్ వార్తల్లో అవి కూడా ఉన్నాయి. ఈరోజు భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అదంపూర్ వెళ్లి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పారు. అదంపూర్ లో ఎస్-400 వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉన్నట్టు ప్రధాని షేర్ చేసిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇక అదంపూర్ ని ధ్వంసం చేశామని చెప్పుకుంటున్న పాక్ కి పరోక్షంగా ఇలా షాకిచ్చారు మోదీ.

 

ఇక అదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని నరేంద్రమోదీ సైనికులతో చాలాసేపు ముచ్చటించారు. అదంపూర్ లో మన పోరాటయోధులను కలిశానని.. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే సైన్యంతో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం అని ఆయన ట్విట్టర్లో చెప్పారు. మన దేశ రక్షణ బలగాలు చేపట్టే ప్రతి చర్యకు ప్రజల మద్దతు ఉంటుందని, వారి రక్షణకోసం సైన్యం చేస్తున్న సాహసానికి ప్రజలు కృతజ్ఞతతో ఉంటారని చెప్పారు మోదీ.

ANN TOP 10