AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో 22 నామినేటెడ్ పదవుల భర్తీ..! ఎవరెవరికంటే..?

ఈసారి నామినేటెడ్ పదవుల ఎంపికతో టీడీపీలో సీనియర్లు శాంతించారా? ఎప్పుడు లేని విధంగా సీనియర్లకు సీఎం చంద్రబాబు పెద్ద పీఠ వేసారా? దీనివల్ల కేవలం పశ్చిమ గోదావరి, తిరుపతికి ఎక్కువ లబ్ది చేకూరిందా? మిగతా జిల్లాల మాటేంటి? తొలిసారి అమరావతి జేఏసీకి అవకాశం కల్పించింది చంద్రబాబు సర్కార్.

 

అమరావతి జేఏసీకి అవకాశం

 

చంద్రబాబు సర్కార్ 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ గత రాత్రి జాబితా విడుదల చేసింది. మొత్తం పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజీపీకి ఒకటి కేటాయించింది. తొలిసారిగా అమరావతి జేఏసీకి రెండు పదవులు దక్కాయి. ఆ రెండు పదవులు చాలా కీలకమైనవి కూడా. టీడీపీకి కేటాయించిన 16 పదవుల్లో 8 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. మిగిలినవారు ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు.

 

ఈసారి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, ఏపీ ప్రెస్‌ అకాడమీ, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ, ఏపీ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ సహా మొత్తం 22 కార్పొరేషన్లు, కమిషన్‌లకు ఛైర్మన్‌లను నియమించింది చంద్రబాబు సర్కార్. మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్‌ జవహర్‌లకు కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

 

అమరావతి జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి చెందిన డాక్టర్‌ రాయపాటి శైలజను ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. ఆలపాటి సురేశ్‌ను ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. కూటమి పొత్తులో నేపథ్యంలో చాలామంది తమ టికెట్లను త్యాగం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించి అభ్యర్థుల విజయానికి కృషి చేసినవారికి తాజాగా నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చింది.

 

మాజీ మంత్రులకు ఛాన్స్

 

తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌‌కు నామినేటెడ్ పదవి వరించింది. ఆయనను ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. మొన్నటి ఎన్నికల్లో కొవ్వూరు టికెట్‌ ఆశించారు. రాజకీయ సమీకరణాల రీత్యా ఆయనకు సీటు లభించలేదు. చివరకు ఆయనకు అవకాశం ఇచ్చారు.

 

మరొకరు మాజీమంత్రి పీతల సుజాత. పార్టీకి విధేయురాలైన ఆమెను మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. 2019, 2024 ఎన్నికల్లో ఆమె టికెట్‌ దక్కలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి విడత నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో వినియోగదారుల రక్షణ మండలి ఛైర్మన్‌గా నియమించారు. ఆమె ఆ బాధ్యతలు చేపట్టలేకపోయారు. ఇప్పుడు మరోసారి అదష్టం వరించింది.

 

పొత్తులో సీట్లు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, సుగుణమ్మ, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌ఛార్జి బాబ్జీకి ఈసారి నామినేటెడ్ పదవుల్లో అవకాశం వరించింది. శేషారావును నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించింది.

 

వలవల బాబ్జీకి భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు ఛైర్మన్‌ పదవి అప్పగించింది. ఏపీ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌-ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నియమించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పదవి కూడా ఆయన్ని వరించింది.

 

ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నేతలకు చోటు దక్కలేదు. ముఖ్యనేతలకు పార్టీ పదవులు ఏమైనా అప్పగిస్తారేమో చూడాలి.

ANN TOP 10