ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లె పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. కొంతమంది కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని విచారణకు పిలిచారు. పాపిరెడ్డిపల్లెలో జగన్ హెలికాప్టర్ ల్యాండైన తర్వాత పలువురు కార్యకర్తలు, అభిమానులు దూసుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ భద్రతపై తాము చేసిన సూచనలను తోపుదుర్తి పెడచెవిన పెట్టారని విమర్శించారు.
తోపుదుర్తి మాటలతో రెచ్చిపోయిన కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెచ్చగొట్టాడని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వివరించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు పంపించారు. తాజాగా సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు.