పాక్ కుయుక్తులను మన సైన్యం ఎలా ఎదురొడ్డి తిప్పికొట్టిందన్న విషయాలను మన దేశ సైనికాధికారులు వివరించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన దుర్భుద్దితో దాడులకు ప్రయత్నించగా మన సైన్యం తిప్పికొట్టడమే కాక, పాకిస్తాన్ కు చుక్కలు చూపిన విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి జరిగిన దాడుల వివరాలను సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ నిన్న రాత్రి భారత గగనతలంలోకి పెద్ద ఎత్తున డ్రోన్‌లు పంపి మిలిటరీ, సివిల్ సదుపాయాలపై దాడి చేసేందుకు ప్రయత్నించిందన్నారు.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ.. భటిండా మిలిటరీ స్టేషన్‌పై పాక్ యూఏవి దాడిని భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుందని తెలిపారు. అనంతరం 4 ఎయిర్ డిఫెన్స్ సైట్లపై భారత డ్రోన్‌ల ద్వారా కచ్చితమైన ప్రతిదాడులు జరిగాయన్నారు. ఇందులో ఒక రాడార్ ధ్వంసమైందని ఆమె తెలిపారు. పాకిస్తాన్ సైన్యం పౌర విమానాలను కవచంగా ఉపయోగిస్తూ దాడులు చేస్తోందని, ఇది అంతర్జాతీయ విమానయాన భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఆమె అభివర్ణించారు.
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. 36 ప్రదేశాల్లో 300 నుండి 400 డ్రోన్‌లు భారత్ వైపు పంపబడ్డాయని, ఇవి టర్కీకి చెందిన డ్రోన్‌లుగా గుర్తించబడినట్లు తెలిపారు. పాక్ ఈ దాడులను భారత్ గగనతల పరిరక్షణ వ్యవస్థను పరీక్షించేందుకు చేసి ఉంటుందని వారు భావిస్తున్నారు.
అంతేకాదు, పూంఛ్, రాజౌరీ, అఖ్నూర్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున షెల్లింగ్ జరిపినట్లు కూడా వివరించారు. అయితే మన దేశానికి జరిగిన అన్యాయంపై, ఐఎంఎఫ్ సమావేశంలో భారత్ స్పష్టంగా తన వాదనను ఉంచనుందని మిస్రీ పేర్కొన్నారు. మొత్తం మీద మన దేశ సైన్యం వీరోచితంగా పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిందని అధికారుల ప్రకటనతో తేటతెల్లమైంది. అయితే భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మన దేశ సైనికులకు భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ, యావత్ భారత్ ప్రజలు తమతమ మందిరాలలో పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కేంద్రం, ప్రధాని మోడీ వెంట మేమున్నాం అంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.