AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతిలో మరో ఇంద్రభవనం..!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో భారీ అడుగు పడుతోంది. విజయవాడ తాడిగడపలో ఏర్పాటు కాబోతున్న జంట టవర్ ఐకాన్ నిర్మాణానికి ఈ వారం నాంది పలకనుంది. రూ.600 కోట్ల వ్యయంతో, ప్రవాసాంధ్రుల సహకారంతో APNRT సొసైటీ ద్వారా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు అమరావతి పునర్నిర్మాణానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది.

 

36 అంతస్తులతో అద్భుతం

ఈ టవర్ ప్రాజెక్టు 36 అంతస్తులతో నిర్మించనుండగా, ఒక టవర్‌ను నివాసాల కోసం, మరొకదాన్ని కార్యాలయాల కోసం వినియోగిస్తారు. అంతేకాక, టాప్ నాలుగు అంతస్తులను వాణిజ్య ఉపయోగాలకు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక మౌలిక వసతులతో రూపొందించబోయే ఈ టవర్, రాష్ట్రానికి ఒక గుర్తింపుగా నిలవనుంది.

 

30 వేల జాబ్స్ టార్గెట్

2028 నాటికి పూర్తవ్వనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 30,000 ఉద్యోగాలు కల్పించనున్నట్టు అంచనా. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి ఇది పెద్ద బూస్టుగా మారనుందని చెప్పవచ్చు. ఇప్పటికే రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు, బేగంపేట – తాడిగడప మధ్య రహదారి విస్తరణలు, శాశ్వత శాసనసభ భవనం పనులు మళ్లీ ఊపందుకున్నాయి.

 

ఇటీవలే ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుల వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా అమరావతిపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ఈ జంట టవర్ నిర్మాణం రాష్ట్రానికి పెట్టుబడులు, టాలెంట్, పునర్నిర్మాణ శక్తి తీసుకొచ్చే మౌలిక ప్రాజెక్టుగా నిలవనుంది. అయితే ఈ భవనం డిజైన్ చూస్తే చాలు ఔరా అనాల్సిందే.

 

ఫోటో వైరల్..

అమరావతిలో నిర్మించే ప్రతి కట్టడం ఒక అద్భుతమే. ఇటీవల ప్రధాని మోడీ స్వయంగా అమరావతి పునః నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. బిజీబిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నేరుగా ప్రధాని మోడీ పునః నిర్మాణానికి హాజరు కావడంతోటే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించే సహాకారం ఎటువంటిదో చెప్పవచ్చు.

 

అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సారథ్యంలో రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సైతం సిద్ధమయ్యారు. ఇక్కడ నిర్మించే ప్రతి కట్టడం ప్రపంచాన్ని ఆకర్షించేలా నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మొత్తం మీద జంట టవర్ ఐకాన్ నిర్మాణం పూర్తి చేసుకుంటే చాలు, ఏపీ రాజధానికి కొత్త అందం వచ్చినట్లే. మరెందుకు ఆలస్యం ప్రజా రాజధాని అమరావతి పూర్తి అవ్వాలని అందరం మనసారా కోరుకుందాం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10