పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి సామాజిక మాధ్యమాలలో అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఎలాంటి నకిలీ సమాచారాన్ని గానీ, తప్పుడు ప్రచారాలను గానీ వ్యాప్తి చేయవద్దని స్పష్టం చేసింది.
ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సామాజిక మాధ్యమంలో అనధికారిక వార్తలు, అవాస్తవాలను పోస్టు చేసినా లేదా షేర్ చేసినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. సామాజిక మాధ్యమాలపై నిరంతర నిఘా ఉంచినట్లు వెల్లడించింది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని, ఇతరులకు పంపవద్దని సూచించింది.
అంతేకాకుండా, ‘ఆపరేషన్ సిందూర్’ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారి వివరాలు తెలిస్తే, తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరింది. అలాంటి సందేశాలు లేదా పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని 8712672222 అనే వాట్సప్ నంబర్‌కు పంపించడం ద్వారా తెలియజేయవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది.