AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆపరేషన్ సిందూర్ మృతులపై పాక్ ప్రకటన..

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతిచర్యగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ జరిపన దాడుల్లో 31 మంది మరణించారని, మరో 46 మంది గాయపడ్డారని పాకిస్థాన్ సైనిక ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు, పాకిస్థాన్ దళాలు గత 14 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. తాజాగా మే 7-8 తేదీల మధ్య జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం చిన్న ఆయుధాలు, ఫిరంగి గుండ్లతో కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. పూంచ్‌లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్‌లో పౌరులు మృతి చెందడం, గురుద్వారా దెబ్బతినడం పట్ల శ్రీ అకాల్ తఖ్త్ జతేదార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “యుద్ధం మానవాళికి ఎప్పుడూ ప్రమాదకరమే. పాకిస్థాన్ షెల్లింగ్‌లో పౌరుల మృతిని, పూంచ్‌లోని గురుద్వారాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని అకాల్ తఖ్త్ తాత్కాలిక జమేదార్ జియానీ కుల్దీప్ సింగ్ గర్గజ్ కోరారు.

 

భారత్‌లో భద్రతా చర్యలు

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, వాయవ్య భారతదేశంలోని 21 విమానాశ్రయాలను మే 10 వరకు మూసివేస్తున్నట్లు అమృత్‌సర్ ఏడీసీపీ-2 సిరివెన్నెల ప్రకటించారు. “కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఈ విమానాశ్రయాల నుంచి ఎలాంటి విమాన సర్వీసులు నడపబడవు” అని ఆమె స్పష్టం చేశారు. అలాగే, పాకిస్థాన్ గూఢచార సంస్థలు సైనిక రైళ్ల కదలికలపై సమాచారం సేకరించే అవకాశం ఉందని, అటువంటి రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులను హెచ్చరించింది. “మిల్ రైల్ సిబ్బంది (రైల్వేల సైనిక విభాగం) తప్ప, ఇతర అనధికార వ్యక్తులకు రైల్వే అధికారులు అటువంటి సమాచారాన్ని వెల్లడించడం భద్రతా ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇది జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది” అని రైల్వే బోర్డు తన ఆదేశాల్లో పేర్కొంది.

 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో భారత వ్యతిరేక దుష్ప్రచారాన్ని అరికట్టాలని, తప్పుడు ఖాతాలను కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల సమన్వయంతో తక్షణమే నిరోధించాలని సూచించింది. సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో అనవసర భయాలను తొలగించడానికి అవగాహన కల్పించాలని కోరింది. స్థానిక యంత్రాంగం, సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని సూచించింది. “ఉగ్రవాదంపై నవ భారత్ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుంది” అని బీజేపీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10