ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సుమారు పదిహేనేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ వారికి ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దీంతో వారిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బావమరిది బీవీ శ్రీనివాసరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి (అప్పటి గనుల శాఖ డైరెక్టర్) వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్‌లను కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికీ ఏడేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి కూడా న్యాయస్థానం రూ.2 లక్షల జరిమానా విధించింది. తీర్పు వెలువడిన అనంతరం దోషులుగా తేలిన నలుగురికి కోర్టు ప్రాంగణంలోనే వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.