AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రశ్న.. పాక్ వెళ్లి చెక్ చేసుకొమ్మన్న బీజేపీ..

పాకిస్థాన్ లోని ఉగ్రవాద క్యాంపులపై 2016 లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఉంటే ఆధారాలు కనిపించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం అనంతరం చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచీ దీనిపై ఆధారాలు అడుగుతున్నానని, అయితే ప్రస్తుతం బాధితుల గాయాలు మానపడటమే ముఖ్యమని, దోషులను గుర్తించి శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని సీడబ్ల్యూసీ తీర్మానించిన కొద్దిసేపటికే చన్నీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 

చరణ్ జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని, వైమానిక దళాన్ని కించపరుస్తోందని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని పాకిస్తానే అంగీకరించినా, కాంగ్రెస్ మాత్రం సైన్యం అబద్ధం చెబుతోందని ఆరోపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే పాకిస్థాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తోందని, సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు.

 

అయితే, ఆ తర్వాత చన్నీ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తాను సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎలాంటి ఆధారాలు అడగలేదని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని, పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు, దేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ANN TOP 10