రాజస్థాన్‌లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్‌ను చేశారు రాజస్థాన్ ఇంటెలిజెన్స్ వింగ్ అధికారులు. జైసల్మేర్‌లో పఠాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఖాన్‌పై అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద కేసు నమోదు చేశారు. అయితే ఖాన్‌ను నెల క్రితమే అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి అతడిని ప్రశ్నిస్తున్నారు. కానీ ఖాన్‌ను అధికారికంగా మే 1 అరెస్టు చేసినట్టు ప్రకటించారు.
2013లో పాకిస్తాన్‌కు వెళ్లిన పఠాన్ ఖాన్ .. అప్పుడే పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో పరిచయం పెంచుకున్నారు. పాక్‌లోనే గూఢచర్యం శిక్షణ పొందిన ఖాన్.. అప్పటి నుంచి తరుచుగా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను కలవడం.. వారితో టచ్‌లో ఉండటం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని భారత్ పాక్ మధ్య ఉన్న సరిహద్దుకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. ఉగ్రమూక సౌత్ కశ్మీర్లో తల దాచుకుంటున్నట్లు అనుమానిస్తోంది NIA. దట్టమైన అటవీ, ఎత్తైన కొండ కోనలు ఉండటంతో…అందులోనే ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తోంది. టెర్రరిస్టుల దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ పెద్ద మొత్తంలో ఉన్నట్లు అనుమానిస్తోంది. బయటి నుంచి ఆహారం రాకున్నా, వారి దగ్గరున్న చాక్లెట్స్, ఇతర సప్లిమెంట్లను తీసుకుంటూ అడవిలో ఆశ్రయం పొందుతున్నట్లు అంచనా వేస్తోంది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించి.. అందుకు తగ్గట్లుగా ఉగ్రవాదులు ముందే ప్రిపేర్ చేసుకున్నట్లు చెబుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ.
ఐతే ఉగ్రమూక మొదటి టార్గెట్ బైసరన్ వ్యాలీ కాదు. అంతకు ముందు మరో మూడు టూరిస్టు స్పాట్స్‌లో రెక్కి కూడా నిర్వహించినట్లు బలగాలు గుర్తించాయి. అరు వ్యాలీ, బేతబ్ వ్యాలీ, అమ్యూజ్మెంట్ పార్క్ లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసినట్లు నిర్ధారణకు వచ్చాయి. ఏప్రిల్ 15న రెక్కీ కూడా నిర్వహించారని, ఐతే ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీ ఫోర్స్ ఉండటంతో, ప్లాన్ మార్చినట్లు అంచనాకు వచ్చాయి. బైసరన్ వ్యాలీని ఎంచుకున్న తర్వాత…రెండ్రోజుల ముందే ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నట్లు అనుమానిస్తున్నాయ్. రెక్కీ నిర్వహించడానికి ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ సాయం చేసినట్లు భావిస్తున్నాయి.
ఐతే నలుగురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు బైసరన్ వ్యాలీకి వచ్చినట్లు అనుమానిస్తోంది NIA. మొత్తం నలుగురు ఆపరేషన్‌లో పాల్గొనగా, మిగితా వారు కవర్ ఫైర్ కోసం వేచి ఉన్నట్లు భావిస్తోంది. ఒకవేళ భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగితే, వెంటనే ఎటాక్ చేయడానికి అలా ప్లాన్ చేసినట్లు అంచనాకు వచ్చింది. ఈ కేసులో భాగంగా మొదట 20 మంది ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్‌ను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో 186 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్‌ను అదుపులోకి తీసుకున్నాయి బలగాలు.
మరోవైపు NIA చీఫ్ సదానంద దాటే పహల్గామ్ వెళ్లారు. బైసరన్ వ్యాలీ ఘటన దర్యాప్తుపై రివ్యూ చేశారు. ఇప్పటి వరకు వంద మందికిపైగా విచారించారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేయగా, NIA కూడా కేసు రిజిస్ట్రర్ చేసింది