AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రూప్-1 పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు రూ. 20,000 చొప్పున జరిమానా..

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ 19 మంది పిటిషనర్లకు రూ.20,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మొత్తం 19 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు జారీ చేసిన మార్కుల మెమోలకు, వెబ్‌సైట్‌లో పొందుపరిచిన మార్కులకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. పారదర్శకంగా రీవాల్యుయేషన్ చేయాలని కోరారు.

 

ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా, పిటిషనర్లు సమర్పించిన ప్రమాణ పత్రాలు తప్పులతడకగా ఉన్నాయని, వారు వాస్తవాలను దాచిపెట్టారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 

టీజీపీఎస్సీ న్యాయవాది వాదనలు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం, అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని నిర్ధారించింది. వాస్తవాలను దాచిపెట్టి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

ఈ క్రమంలో, ప్రతి పిటిషనర్‌కు రూ.20,000 చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, తప్పుడు ప్రమాణ పత్రాలు సమర్పించినందుకు గాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10