తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో భద్రతా దళాలు మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తూ కాల్పులు జరుపుతున్నాయి.
ఈ ఆపరేషన్ కారణంగా వందలాది మంది మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఇటీవల పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎదురుకాల్పుల్లో మరణించారు. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు శాంతి చర్చల గురించి ప్రస్తావిస్తున్నారు. తమను శాంతి చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ విడుదల చేశారు.
కర్రెగుట్టలో ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతోందని, ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేసి చర్చలకు పిలవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. శాంతి చర్చలకు తాము సిద్ధమని గత వారం కూడా లేఖ రాసినట్లు పేర్కొంది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలైంది.
అయితే, మావోయిస్టుల విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.